Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLatest NewsGT vs KKR | రింకూ రచ్చ రంబోలా.. ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు-ఉత్కంఠ పోరులో...

GT vs KKR | రింకూ రచ్చ రంబోలా.. ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు-ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై కోలకతా జయభేరి

GT vs KKR | టైమ్‌ 2 న్యూస్‌, అహ్మదాబాద్‌: పిట్ట కొంచం కూత ఘనం అన్న చందంగా రింకూ సింగ్‌ (21 బంతుల్లో 48 నాటౌట్‌; ఒక ఫోర్‌, 6 సిక్సర్లు).. సిక్సర్లతో రెచ్చిపోవడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. ఏమాత్రం ఆశలే లేని స్థితి నుంచి రింకూ అద్వితీయ పోరాటం కనబర్చడంతో కోల్‌కతా సూపర్‌ విక్టరీ ఖాతాలో వేసుకుంది.

ఆదివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ‘త్రి డైమెన్షన్‌ ప్లేయర్‌’ విజయ్‌ శంకర్‌ (24 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అదిరిపోయే అర్ధశతకం నమోదు చేసుకోగా.. సాయి సుదర్శన్‌ (38 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (40 బంతుల్లో 83; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) యాంకర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (29 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అయితే కోల్‌కతాను గెలిపించింది మాత్రం రింకూ సింగ్‌ సునామీ ఇన్నింగ్సే. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నాడు. రింకూ సింగ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

7 బంతుల్లో 40..

భారీ లక్ష్యఛేదనలో కోల్‌కతా ఆరంభం నుంచి ఆకట్టుకున్నా.. 17వ ఓవర్లో గుజరాత్‌ స్టాండిన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. వరుస బంతుల్లో మిస్సైల్‌ మ్యాన్‌ రస్సెల్‌ (0)తో పాటు సునీల్‌ నరైన్‌ (0), శార్దూల్‌ ఠాకూర్‌ (0)ను ఔట్‌ చేయడంతో నైట్‌ రైడర్స్‌ పరాజయం ఖాయమనిపించింది. అయితే అక్కడే అద్భుతం ఆవిష్కృతమైంది. 19 ఓవర్‌ చివరి రెండు బంతులకు 6,4 కొట్టిన రింకూ.. యష్‌ దయాల్‌ వేసిన చివరి ఓవర్లో అరాచకానికి అర్ధం మార్చాడు. తొలి బంతికి ఉమేశ్‌ యాదవ్‌ సింగిల్‌ తీసి ఇవ్వగా.. అక్కడి నుంచి వరుసగా ఐదు బంతులను అతడు సిక్సర్లుగా మలిచి కోల్‌కతాను గెలిపించాడు. రింకూ సింగ్‌ ఎదుర్కొన్న చివరి ఏడు బంతులకు 6,4,6,6,6,6,6 కొట్టడం గమనార్హం. హార్దిక్‌ పాండ్యా గైర్హాజరీలో ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు రషీద్‌ ఖాన్‌ సారథ్యం వహించగా.. చివరి ఓవర్‌లో యష్‌ దయాల్‌ అనుభవ రాహిత్యం టైటాన్స్‌ కొంప ముంచింది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News