Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsGT vs LSG | అన్నదమ్ముల సవాల్‌లో తమ్ముడిదే పైచేయి.. లక్నోపై గుజరాత్‌ గ్రాండ్‌ విక్టరీ

GT vs LSG | అన్నదమ్ముల సవాల్‌లో తమ్ముడిదే పైచేయి.. లక్నోపై గుజరాత్‌ గ్రాండ్‌ విక్టరీ

GT vs LSG | టైమ్‌ 2 న్యూస్‌, అహ్మదాబాద్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌.. అనధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరింది. వరుస విజయాలతో బెంబేలెత్తిస్తున్న హార్దిక్‌ పాండ్యా సేన.. 56 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుచేసింది. అన్నదమ్ముల సవాల్‌గా సాగిన పోరులో అన్న కృనాల్‌పై తమ్ముడు హార్దిక్‌దే పైచేయి అయింది. టాపార్డర్‌ విజృంభించడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఎనిమిదో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో గుజరాత్‌ 56 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (51 బంతుల్లో 94 నాటౌట్‌; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), వృద్ధిమాన్‌ సాహా (43 బంతుల్లో 81; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 12 ఓవర్లలో 142 పరుగులు జోడించి గట్టి పునాది వేయగా.. ఆ తర్వాత కూడా టైటాన్స్‌ అదే జోరు కొనసాగించింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (25; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (21 నాటౌట్‌; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌) వేగంగా ఆడారు. లక్నో బౌలర్లలో అవేశ్‌, మొహసిన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఓపెనర్లు దంచినా..

అనంతరం లక్ష్యఛేదనలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు కైల్‌ మయేర్స్‌ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), క్వింటన్‌ డికాక్‌ (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టారు. అయితే వీరిద్దరూ మినహా తక్కినవాళ్లంతా విఫలమవడంతో లక్నోకు పరాజయం తప్పలేదు. దీపక్‌ హుడా (11), మార్కస్‌ స్టొయినిస్‌ (4), నికోలస్‌ పూరన్‌ (3), ఆయుష్‌ బదోనీ (21) పెవిలియన్‌కు వరుస కట్టారు. గుజరాత్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ 4, షమీ, రషీద్‌, నూర్‌ అహ్మద్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. గిల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో పంజాబ్‌ కింగ్స్‌ తలపడనుంది.

తమ్ముడిదే పైచేయి..

గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన కేఎల్‌ రాహుల్‌ స్థానంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు కృనాల్‌ పాండ్యా సారథ్యం వహిస్తుండగా.. ఈ మ్యాచ్‌లో తన తమ్ముడు హార్దిక్‌ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్‌తో లక్నో తలపడింది. టాస్‌ గెలిచిన కృనాల్‌ ఫీల్డింగ్‌ నిర్ణయం తీసుకోగా.. తొలి ఓవర్‌ నుంచే గుజరాత్‌ ఓపెనర్లు ఊచకోత మొదలెట్టారు. సాహా, గిల్‌ పోటీపడి పరుగులు రాబట్టడంతో కృనాల్‌ నిర్ణయం తప్పని తేలేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ముఖ్యంగా సాహా ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తే.. గిల్‌ తన క్లాస్‌ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. లక్నో పేలవ బౌలింగ్‌తో గుజరాత్‌ భారీ స్కోరు చేయగా.. లక్ష్యఛేదనలో లక్నో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మయేర్స్‌, డికాక్‌ క్రీజులో ఉన్నంతసేపు పోటీలో కనిపించిన లక్నో ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పరాజయాన్ని ఆహ్వానించింది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News