Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsCSK vs RCB | దుమ్మురేపిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. పోరాడి ఓడిన బెంగళూరు

CSK vs RCB | దుమ్మురేపిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. పోరాడి ఓడిన బెంగళూరు

CSK vs RCB | టైమ్‌ 2 న్యూస్‌, బెంగళూరు: బ్యాటర్ల విధ్వంసానికి బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో ఐపీఎల్‌ 16వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడో విజయం ఖాతాలో వేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం జరిగిన పోరులో ఇరు జట్లు కలిసి 444 పరుగులు చేయగా.. చెన్నై 8 పరుగుల తేడాతో బెంగళూరును చిత్తుచేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ధోనీసేన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్‌ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు నమోదు చేసుకోగా.. అజింక్యా రహానే (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రాయుడు (14, ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌), మోయిన్‌ అలీ (19 నాటౌట్‌; 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్‌, పార్నెల్‌, మ్యాక్స్‌వెల్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. గత మ్యాచ్‌లో మూడు వికెట్లతో మెరిసిన విజయ్‌కుమార్‌ వైశాక్‌ (62/1) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) మోత మోగించారు.

చెన్నై మూడో అత్యధిక స్కోరు..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఐపీఎల్లో తమ మూడో అత్యధిక స్కోరు నమోదు చేసుకుంది. 2010 తర్వాత లీగ్‌లో ధోనీ సేనకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. మూడో ఓవర్లోనే రుతురాజ్‌ గైక్వాడ్‌ (3)ను ఔట్‌ చేసి మహమ్మద్‌ సిరాజ్‌ బెంగళూరుకు శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత చెన్నై ఏ దశలోనూ తగ్గలేదు. కాన్వే సిక్సర్లే లక్ష్యంగా చెలరేగిపోతుంటే.. ఇటీవలి కాలంలో తన గేమ్‌ ప్లాన్‌ మార్చేసుకున్న అజింక్యా రహానే ఉన్నంతసేపు అదరగొట్టాడు. రహానే ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన దూబే తొలి బంతి నుంచే విరుచుకుపడటంతో 12 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 123/2తో నిలిచింది. మిగిలిన బౌలర్లంతా భారీగా పరుగులిచ్చుకుంటున్న సమయంలో హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ ఆకట్టుకోగా.. సెంచరీ చేసేలా కనిపించిన కాన్వే చివరకు హర్షల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన రాయుడు, మోయిన్‌ అలీ, జడేజా వేగంగా ఆడటంతో ధోనీ సేన భారీ స్కోరు చేసింది.

మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం..

భారీ లక్ష్యఛేదనలో సొంతగడ్డపై అశేష అభిమానుల ప్రోత్సాహం మధ్య బరిలోకి దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. తొలి రెండు బంతుల్లో 6 పరుగులు చేసిన కోహ్లీ నాలుగో బంతికి ఔట్‌ కాగా.. మరుసటి ఓవర్‌లో మహిపాల్‌ లోమ్రర్‌ (0) వెనుదిరిగాడు. అయితే ఈ దశలో కెప్టెన్‌ డుప్లెసిస్‌కు మ్యాక్స్‌వెల్‌ జత కలవడంతో బెంగళూరు దూసుకెళ్లింది. సిక్సర్లు కొట్టడం ఇంత సులువా అన్నట్లు ఈ జోడీ దంచికొడుతుంటే.. చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోగా.. డుప్లెసిస్‌ 23 బంతుల్లో మ్యాక్స్‌వెల్‌ 24 బంతుల్లో అర్ధశతకాలు నమోదు చేసుకున్నారు. మూడో వికెట్‌కు 61 బంతుల్లోనే 126 పరుగులు జోడించిన అనంతరం మ్యాక్స్‌వెల్‌ ఔట్‌ కాగా.. కాసేపటికే డుప్లెసిస్‌ కూడా అతడిని అనుసరించాడు. ఈ దశలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన దినేశ్‌ కార్తీక్‌ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) వేగం పెంచే క్రమంలో ఔట్‌ కాగా.. సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ (19, 2 సిక్సర్లు) జట్టును గెలుపు గీత దాటించలేకపోయాడు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News