Home Latest News IND vs AUS | తొలి రోజు ఆస్ట్రేలియాదే.. ఉస్మాన్‌ ఖవాజా అజేయ సెంచరీ

IND vs AUS | తొలి రోజు ఆస్ట్రేలియాదే.. ఉస్మాన్‌ ఖవాజా అజేయ సెంచరీ

IND vs AUS | టైమ్‌ 2 న్యూస్‌, అహ్మదాబాద్‌: ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌లో తొలిసారి వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానం ‘నరేంద్ర మోదీ స్టేడియం’లో గురువారం ప్రారంభమైన పోరులో ఆసీస్‌ చక్కటి ప్రదర్శన కనబర్చింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న కంగారూలు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేశారు. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (251 బంతుల్లో 104 బ్యాటింగ్‌; 15 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా.. కామెరూన్‌ గ్రీన్‌ (49 బ్యాటింగ్‌; 8 ఫోర్లు), కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (38), ట్రావిస్‌ హెడ్‌ (32) రాణించారు. ఈ సిరీస్‌లో ఆసీస్‌ తరఫున ఇదే తొలి శతకం కాగా.. భారత బౌలర్లలో షమీ రెండు, అశ్విన్‌, జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు. గత మూడు మ్యాచ్‌ల్లో తొలి రోజు నుంచే స్పిన్నర్లు ప్రభావం చూపగా.. అహ్మదాబాద్‌ పిచ్‌ మాత్రం బ్యాటర్లకు అనుకూలించింది. బంతి చక్కగా బ్యాట్‌పైకి వస్తుండటంతో ఆసీస్‌ ప్లేయర్లు పండగ చేసుకున్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్లూ్యటీసీ) ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా బరిలోకి దిగిన రోహిత్‌ సేన.. శుక్రవారం ప్రత్యర్థిని ఎంతలోపు కట్టడి చేస్తుందో చూడాలి.

ఖతర్నాక్‌ ఖవాజా..

ఈ సిరీస్‌కు ముందు రెండుసార్లు భారత పర్యటనకు ఎంపికైన ఉస్మాన్‌ ఖవాజా 8 మ్యాచ్‌ల్లోనూ డ్రింక్స్‌ అందించేందుకే పరిమితమయ్యాడు. పాకిస్థాన్‌లో పుట్టి పెరిగిన ఖవాజాకు ఈసారి తుది జట్టులో చోటు దక్కగా.. సిరీస్‌ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబర్చాడు. ఇండోర్‌ పిచ్‌పై బంతి అనూహ్యంగా తిరుగుతున్న చోట భారత స్పిన్‌ దాడిని ఎదుర్కొంటూ మొండిగా నిలిచిన ఖవాజా.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న మొతెరాలో మోత మోగించాడు. అడ్డదిడ్డమైన షాట్ల జోలికి పోకుండా.. పక్కా క్రికెటింగ్‌ స్ట్రోక్స్‌తో అలరించాడు. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు.

ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా సాధికారికంగా ముందుకు సాగారు. వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన ట్రావిస్‌ హెడ్‌.. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన అనంతరం హెడ్‌ను అశ్విన్‌ ఔట్‌ చేయగా.. కాసేపటికి మార్నస్‌ లబుషేన్‌ (3) పెవిలియన్‌ బాట పట్టాడు. షమీ వేసిన ఆఫ్‌కట్టర్‌ను లబుషేన్‌ వికెట్ల మీదకు ఆడుకున్నాడు. అయితే ఈ దశలో ఖవాజాకు స్మిత్‌ తోడయ్యాడు. ఒకవైపు ఉస్మాన్‌ స్వేచ్ఛగా షాట్లు కొడుతుంటే.. మరో ఎండ్‌లో స్మిత్‌ క్రీజులో పాతుకుపోయాడు. అయితే ఈ జోడీ మరీ నెమ్మదిగా పరుగులు చేసింది. 248 బంతుల్లో 79 పరుగులు జతచేసిన అనంతరం స్మిత్‌ ఔటయ్యాడు. హ్యాండ్స్‌కోంబ్‌ (17) ఎక్కువసేపు నిలువలేకపోగా.. ఆఖర్లో కామెరూన్‌ గ్రీన్‌ ధాటిగా ఆడాడు. ఖవాజా, గ్రీన్‌ అభేద్యమైన ఐదో వికెట్‌కు 116 బంతుల్లోనే 85 పరుగులు జోడించడం విశేషం. తొలి రోజు చివరి ఓవర్‌లో డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా బౌండ్రీ బాది ఖవాజా టెస్టుల్లో 14వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Exit mobile version