Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsWorld Boxing Championship | తిరుగులేని పంచ్‌ పవర్‌.. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూ, స్వీటీ...

World Boxing Championship | తిరుగులేని పంచ్‌ పవర్‌.. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూ, స్వీటీ పసిడి ధమాకా

World Boxing Championship | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ అదిరిపోయే బోణీ కొట్టింది. సొంతగడ్డపై జరుగుతున్న మెగాటోర్నీలో అంచనాలకు అనుగుణంగా రాణించిన మన బాక్సర్లు నీతూ గంగాస్ ( Nitu Ghanghas )‌, స్వీటీ బూర ( Saweety Boora ) పసిడి పతకాలతో తళుక్కుమన్నారు. బరిలోకి దిగిన తొలిసారే నీతూ స్వర్ణ పతకం ఒడిసి పట్టుకుంటే, తొమ్మిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్వీటీ తన పసిడి కలను సాకారం చేసుకుంది. స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా దిగ్గజ బాక్సర్‌, ఆరు సార్లు ప్రపంచ విజేత మేరీకోమ్‌, సరితాదేవి, జెన్నీ, లేఖ, నిఖత్‌ జరీన్‌ సరసన నీతూ, స్వీటీ నిలిచారు.

ఫైనల్‌ బౌట్ల విషయానికొస్తే తొలుత జరిగిన 48 కేజీల ఫైనల్లో యువ బాక్సర్‌ నీతూ 5-0 తేడాతో లుట్స్‌సకైన్‌ అట్లాన్‌స్టెగ్‌ (మంగోలియా)పై అద్భుత విజయం సాధించింది. మెగాటోర్నీలో తిరుగులేని విజయాలతో తుదిపోరులోకి అడుగుపెట్టిన ఈ హర్యానా బాక్సర్‌ అదే జోరు కొనసాగించింది. తన ఎత్తును అనుకూలంగా మలుచుకుంటూ మంగోలియా బాక్సర్‌పై సూపర్‌ పంచ్‌లతో విరుచుకుపడింది. తొలి రౌండ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నీతూకు రెండో రౌండ్‌లో ప్రత్యర్థి నుంచి ఒకింత ప్రతిఘటన ఎదురైంది. అయితే మూడో రౌండ్‌లో ఎక్కడా పట్టు సడలించని నీతూ.. మంగోలియా బాక్సర్‌ లక్ష్యంగా క్లీన్‌ పంచ్‌లు, జాబ్స్‌, హుక్స్‌తో ముప్పేట దాడికి పాల్పడింది. ఈ క్రమంలో రిఫరీల నుంచి కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. విజేతగా రిఫరీ తన పేరు ప్రకటించగానే ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన నీతు ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అభిమానులకు అభివాదం చేసింది. తాను ఎంతగానో అభిమానించే స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌సింగ్‌ ఈ బౌట్‌ను ప్రత్యక్షంగా వీక్షించి నీతూను అభినందించాడు.

భారత సీనియర్‌ బాక్సర్‌ స్వీటీ బూర తన చిరకాల కల నెరవేర్చుకుంది. 2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చివరిసారి రజతం గెలిచిన స్వీటీ.. తొమ్మిదేండ్ల తర్వాత పసిడి పతకాన్ని ముద్దాడింది. శనివారం జరిగిన 81 కిలోల తుదిపోరులో స్వీటీ 4-3 తేడాతో వాంగ్‌ లీనా (చైనా)పై ఉత్కంఠ విజయాన్ని సొంతం చేసుకుంది. పసిడి దక్కించుకోవాలన్న పట్టుదలతో పోటీకి దిగిన స్వీటీకి చైనా బాక్సర్‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. తొలి రౌండ్‌లో స్వీటీ సంధించిన పంచ్‌లు పట్టుతప్పాయి. అయితే చైనా బాక్సర్‌ ఎత్తుగడను అంచనా వేసిన స్వీటీ కచ్చితమైన పంచ్‌తో పోటీలోకి వచ్చింది. దీంతో రెండో రౌండ్‌ ముగిసే సరికి ఈ హర్యానా బాక్సర్‌ 3-2 ఆధిక్యం కనబరిచింది. అయితే మూడో రౌండ్‌లో ప్రత్యర్థి పంచ్‌ల నుంచి తప్పించుకుంటూ వీలుచిక్కినప్పుడల్లా జాబ్స్‌, హుక్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసి సఫలమైంది. మొత్తంగా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తూ ఈ హర్యానా బాక్సర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News