Home Latest News Surya Kumar Yadav | అక్కడా, ఇక్కడా మనోళ్లదే హవా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో...

Surya Kumar Yadav | అక్కడా, ఇక్కడా మనోళ్లదే హవా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో సూర్యకుమార్‌

Image Source: Surya Kumar Yadav Twitter

Surya Kumar Yadav | టైమ్‌ 2 న్యూస్‌, దుబాయ్‌: లేటు వయసులో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన భారత స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ 908 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటి వరకు డేవిడ్‌ మలాన్‌ మాత్రమే సూర్య కంటే ఎక్కువ ర్యాంకింగ్స్‌ పాయింట్లు సాధించాడు.

2020లో మలాన్‌ అత్యధికంగా 915 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. ప్రస్తుతం సూర్య దానికి 7 పాయింట్లు దూరంలో ఉన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్‌ పాయింట్స్‌లో ఇదే రెండో అత్యధికం. మహమ్మద్‌ రిజ్వాన్‌ (836 పాయింట్లు), కాన్వే (788 పాయింట్లు), బాబర్‌ ఆజమ్‌ (778 పాయింట్లు), మార్క్‌రమ్‌ (748 పాయింట్లు) టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు. ఈ విభాగంలో సూర్యకుమార్‌ తర్వాత భారత్‌ నుంచి అత్యుత్తమంగా విరాట్‌ కోహ్లీ (618 పాయింట్లు) 14వ స్థానం దక్కించుకున్నాడు.

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన సూర్యకుమార్‌ అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. రాంచీ వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ‘360 డిగ్రీస్‌ ప్లేయర్‌’.. లక్నోలో జరిగిన రెండో టీ20లో సంయమనంతో కూడిన ఆటతో ఆకట్టుకున్నాడు. పిచ్‌ బౌలర్లకు సహకరిస్తున్న సమయంలో ఓపికగా క్రీజులో నిలిచిన సూర్యకుమార్‌.. చివరి ఓవర్‌ వరకు క్రీజులో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లాడి 239 పరుగులు చేసిన సూర్యకుమార్‌.. 2022 సంవత్సరానికి గానూ ఐసీసీ ‘టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. పొట్టి ఫార్మాట్‌ బౌలింగ్‌లో భారత బౌలర్లెవరూ టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత టీ20 కెప్టెన్‌, హార్దిక్‌ పాండ్యా మూడో స్థానంలో నిలిచాడు.

వన్డేల్లో సిరాజ్‌ నంబర్‌వన్‌

గత కొంతకాలంగా వన్డేల్లో అద్వితీయమైన ప్రదర్శన కనబరుస్తున్న హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజాగా స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌ సిరీస్‌ల్లో దుమ్మురేపిన ఈ హైదరాబాదీ 729 ర్యాంకింగ్స్‌ పాయింట్లతో టాప్‌లో ఉండగా.. జోష్‌ హజిల్‌వుడ్‌ (727 పాయింట్లు), ట్రెంట్‌ బౌల్ట్‌ (708) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

బుమ్రా గైర్హాజరీలో వచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టిన సిరాజ్‌ టాప్‌ ర్యాంక్‌కు చేరగా.. ఆ తర్వాత మన దేశం నుంచి మణికట్టు మాంత్రికుడు కుల్దీప్‌ యాదవ్‌ (20వ ర్యాంక్‌) ఒక్కడే టాప్‌-20లో ఉన్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో పాకిస్థాన్‌ సారథి బాబర్‌ ఆజమ్‌ (887 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా యువ ఓపెఏనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (734 పాయింట్లు), భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (727 పాయింట్లు) వరుసగా ఆరో, ఏడో ప్లేస్‌ల్లో కొనసాగుతున్నారు. భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (719 పాయింట్లు) తొమ్మిదో స్థానం దక్కించుకున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rishabh Pant | క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్‌.. పంత్ సర్జరీ సక్సెస్‌!

Rishab Pant | రిషబ్‌ పంత్‌ సర్జరీ సక్సెస్‌.. తొందరలోనే డిశ్చార్జి.. కానీ అదొక్కటే సమస్య

Novak Djokovic | జొకో జైత్రయాత్ర.. 22వ గ్రాండ్‌స్లామ్‌తో అగ్రస్థానానికి చేరిన సెర్బియా వీరుడు

India Vs New Zealand | ఉత్కంఠ పోరులో రెండో టీ20లో కివీస్‌పై భారత్ విజయం.. సిరీస్‌పై ఆశలు

Exit mobile version