Home Latest News SRH vs RR | సన్‌రైజర్స్‌ సంచలన విజయం.. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్‌

SRH vs RR | సన్‌రైజర్స్‌ సంచలన విజయం.. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్‌

pic credit: IPL twitter

SRH vs RR | టైమ్‌ 2 న్యూస్‌, జైపూర్‌: భారీ చేజింగ్‌లో దుమ్మురేపిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్లో నాలుగో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో రైజర్స్‌ 4 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను చిత్తుచేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (59 బంతుల్లో 95; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (38 బంతుల్లో 66 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), యశస్వి జైస్వాల్‌ (18 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, జాన్సెన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (34 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. రాహుల్‌ త్రిపాఠి (29 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (25 బంతుల్లో 33; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. చివర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (7 బంతుల్లో 25; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు), అబ్దుల్‌ సమద్‌ (7 బంతుల్లో 17 నాటౌట్‌; 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్‌ బౌలర్లలో చాహల్‌ 4 వికెట్లు పడగొట్టాడు. ఫిలిప్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది.

ఛేదనలో అదుర్స్‌

యువ త్రయం రాణించడంతో రైజర్స్‌ పోటీలో నిలిచినా.. మిడిల్‌ ఓవర్స్‌లో అంతర్జాతీయ ఆటగాళ్లు తడబడటంతో గెలుపు కష్టమే అనిపించింది. 18 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్‌ 174/5తో నిలిచింది. విజయానికి 12 బంతుల్లో 41 పరుగులు అవసరం కాగా.. బ్రూక్‌ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న గ్లెన్‌ ఫిలిప్స్‌ శివతాండవమాడాడు. కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 19వ ఓవర్లో వరుసగా 6,6,6,4 బాది ఐదో బంతికి ఔటయ్యాడు. చివరి బంతికి జాన్సెన్‌ రెండు పరుగులు తీయడంతో సమీకరణం 6 బంతుల్లో 17కు చేరింది. సందీప్‌ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతికి సమద్‌ ఇచ్చిన క్యాచ్‌ను మెక్‌కాయ్‌ వదిలేయగా.. రెండో బంతికి సమద్‌ భారీ సిక్సర్‌ దంచాడు. మూడో బంతికి రెండు పరుగుల రాగా.. ఆ తర్వాత మనవాళ్లు భారీ షాట్లు ఆడలేకపోయారు.

రైజర్స్‌ విజయానికి చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. సమద్‌ కొట్టిన బాల్‌ను లాంగాఫ్‌ ఫీల్డర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో హైదరాబాద్‌ అభిమానులంతా నిరాశలో కూరుకుపోగా.. ఆ బంతి నోబాల్‌ అని తేలింది. ఇక విజయానికి చివరి బాల్‌కు నాలుగు పరుగలు అవసరం కాగా.. సమద్‌ బౌలర్‌ తలమీదుగా.. సూపర్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. గత మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయలేక చతికిలబడ్డ రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో విజృంభించడం కొసమెరుపు.

Exit mobile version