Home Latest News WPL 2023 | అవే సీన్స్‌ రిపీట్‌.. ఐపీఎల్‌ ఆరంభ పోరులో జరిగినట్లే ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లోనూ...

WPL 2023 | అవే సీన్స్‌ రిపీట్‌.. ఐపీఎల్‌ ఆరంభ పోరులో జరిగినట్లే ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లోనూ జరిగాయి !

WPL 2023 | టైమ్ 2 న్యూస్, ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ నిర్వహించగా.. ఏడాది తిరగకముందే భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు అంకురార్పణ జరిగింది. పొట్టి ఫార్మాట్‌ను అభిమానులకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభమైన ఫ్రాంచైజీ క్రికెట్‌లో తొలి మ్యాచ్ 2008 ఏప్రిల్ 18న బెంగళూరు వేదికగా జరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పెను మార్పులు తీసుకొచ్చిన ఐపీఎల్ తరహాలోనే తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు తెరలేచింది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు, డబ్ల్యూపీఎల్ తొలి పోరుకు చాలా సారూప్యతలు ఉండటం యాదృచ్చికం! ఐపీఎల్ ఆరంభ పోరుకు ముందు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా.. అచ్చం డబ్ల్యూపీఎల్‌లోనూ బాలీవుడ్ తారలు కియరా అద్వానీ, కృతి సనన్ ఆడి పాడారు. అప్పుడూ ఇప్పుడు మ్యాచ్ మధ్యలో చీర్ లీడర్స్ నృత్యాలు అలరించగా.. స్కోరు బోర్డు కూడా దాదాపు ఒకే విధంగా దర్శనమిచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య సాగిన ఐపీఎల్ తొలి పోరుకు.. డబ్లూ్యపీఎల్ ఆరంభ మ్యాచ్కు మధ్య ఉన్న సారుపత్యలను ఓసారి గమనిస్తే..

  • ఐపీఎల్ తొలి పోరులో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. డబ్ల్యూపీఎల్‌లోనూ గుజరాత్ జెయింట్స్ టాస్‌ గెలిచి ఛేదనకు మొగ్గుచూపింది.
  • రెండు లీగ్స్‌లోనూ టాస్ గెలిచిన జట్లు మ్యాచ్ ఓడి పోయాయి.
  • పొట్టి ఫార్మాట్‌లో ఛేదన సులువు అనుకుంటే.. రెండు లీగ్స్‌లోనూ ప్రత్యర్థులు భారీ స్కోర్లు చేయడంతో చేజింగ్ సాధ్యపడలేదు.
  • ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగా.. డబ్ల్యూపీఎల్ ఆరంభ పోరులో ముంబై ఇండియన్స్ 5 వికెట్లకు 207 పరుగులు చేసింది.
  • ఐపీఎల్ ఆరంభ పోరులో బ్రెండన్ మెక్కల్లమ్ (73 బంతుల్లో 158 నాటౌట్; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడితే.. డబ్ల్యూపీఎల్ మొదటి మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 65 పరుగులు సాధించింది.
  • ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 140 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలుపొందగా.. డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ 143 పరుగులతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.
  • ఐపీఎల్లో భారీ లక్ష్యఛేదనలో బెంగళూరు 82 పరుగులకు కుప్పకూలగా.. డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ 64 రన్స్కు పరిమితమైంది.
  • ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ చేజింగ్‌లో తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగిన ప్రవీణ్ కుమార్ (18) టాప్ స్కోరర్ కాగా.. తాజా పోరులో ఆరో ప్లేస్లో బ్యాటింగ్‌కు వచ్చిన హేమలత (29) అత్యధిక పరుగులు చేసింది. వీరిద్దరూ ఒక ఫోర్, రెండేసి సిక్సర్లు బాదడంతో పాటు.. నాటౌట్‌గా నిలువడం మరో విశేషం.
Exit mobile version