Home Latest News RCB vs LSG | బదులు తీర్చుకున్న బెంగళూరు.. లక్నోపై ఘనవిజయం

RCB vs LSG | బదులు తీర్చుకున్న బెంగళూరు.. లక్నోపై ఘనవిజయం

RCB vs LSG | టైమ్‌ 2 న్యూస్‌, లక్నో: మేఘావృతమైన వాతావరణంలో వరుణుడి అంతరాయం మధ్య జరిగిన పోరులో బౌలర్లు పండగ చేసుకున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) 18 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుచేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్లు డుప్లెసిస్‌ (40 బంతుల్లో 44; ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌), విరాట్‌ కోహ్లీ (30 బంతుల్లో 31; 3 ఫోర్లు) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ 3, రవి బిష్ణోయ్‌, అమిత్‌ మిశ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నెమ్మదిగా ఆడిన కోహ్లీ.. డుప్లెసిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించిన అనంతరం ఔట్‌ కాగా.. ఆ తర్వాత ఏ దశలోనూ బెంగళూరు ఇన్నింగ్స్‌ కోలుకోలేకపోయింది. మ్యాచ్‌ మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో పిచ్‌ బౌలర్లకు సహకరించగా.. బెంగళూరు బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయంటే మ్యాచ్‌ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

అనంతరం లక్ష్యఛేదనలో లక్నో 19.5 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. కృష్ణప్ప గౌతమ్‌ (13 బంతుల్లో 23; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. మయేర్స్‌ (0), బదోనీ (4), కృనాల్‌ పాండ్యా (14), దీపక్‌ హుడా (1), పూరన్‌ (9), స్టోయినిస్‌ (13) విఫలమయ్యారు. గాయం కారణంగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ చేయలేకపోవడం లక్నో విజయావకాశాలపై ప్రభావం చూపింది. బెంగళూరు బౌలర్లలో కరణ్‌ శర్మ, హజిల్‌వుడ్‌ రెండేసి వికెట్లు తీశారు.

ఆ మ్యాచ్‌ అలా.. ఈ మ్యాచ్‌ ఇలా..

తాజా సీజన్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఏప్రిల్‌10న జరిగిన పోరులో లక్నో చివరి బంతికి గట్టెక్కింది. రెండు టీమ్‌లు కలిపి 425 రన్స్‌ చేసిన ఆ మ్యాచ్‌లో అభిమానులు పరుగుల పండగ చేసుకోగా.. తాజా పోరులో వికెట్ల సరదా తీరింది. ముగ్గురు మొనగాళ్లు కోహ్లీ, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ అర్ధశతకాలతో బెంగళూరు 212 రన్స్‌ చేయగా.. చివరి వరకు ఉత్కంఠ రేపిన పోరులో స్టోయినిస్‌, నికోలస్‌ పూరన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడటంతో లక్నో గెలుపొందింది. చివరి బంతికి బైస్‌ రూపంలో పరుగు తీసిన అవేశ్‌ ఖాన్‌ సంబురాల్లో మునిగిపోగా.. ప్రేక్షకులను నోరు మూసుకోమని సైగలు చేసిన లక్నో కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ వార్తల్లోకెక్కాడు. ఈ ఘటన మనసులో పెట్టుకున్న కోహ్లీ.. సోమవారం మ్యాచ్‌లో ఫుల్‌ జోష్‌ కనబరిచాడు. వికెట్‌ పడ్డ ప్రతిసారి తనకు అలవాటైన రీతిలో ఆవేశంగా చేతులు గాల్లోకి విసురుతూ సంబురాలు జరుపుకోవడంతో పాటు.. మరింత సందడి చేయాలని అభిమానులను కోరుతూ కనిపించాడు.

రాహుల్‌కు గాయం

లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో డుప్లెసిస్‌ ఎక్స్‌ట్రా కవర్స్‌ వైపు కొట్టిన బంతిని ఆపే క్రమంలో రాహుల్‌ గాయపడ్డాడు. అతడి కుడి తొడ పట్టేయడంతో మైదానంలో కూప్పకూలిన రాహుల్‌.. ఫిజియో సహాయంతో స్టేడియాన్ని వీడాడు. అతడి గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, లక్నో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో చివరి వికెట్‌గా క్రీజులోకి వచ్చిన రాహుల్‌ పరిగెత్తడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ కనిపించాడు.

Exit mobile version