Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsMI vs CSK | 13 ఏండ్ల తర్వాత చెన్నై చిద్విలాసం.. ముంబై ఇండియన్స్‌పై గ్రాండ్‌విక్టరీ

MI vs CSK | 13 ఏండ్ల తర్వాత చెన్నై చిద్విలాసం.. ముంబై ఇండియన్స్‌పై గ్రాండ్‌విక్టరీ

MI vs CSK | టైమ్‌ 2 న్యూస్‌, చెన్నై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నైదే పైచేయి అయింది. లీగ్‌ చరిత్రలోనే అత్యధిక సార్లు (16) డకౌట్‌ అయిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకోగా.. 13 ఏండ్ల తర్వాత చెపాక్‌ స్టేడియంలో ముంబైపై చెన్నై తొలి విజయం సాధించింది. పేసర్లు విజృంభించడంతో ముంబై ఓ మాదిరి స్కోరుకే పరిమితం కాగా.. టాపార్డర్‌ రాణించడంతో ధోనీ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. సమష్టిగా సత్తాచాటిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన తొలి పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో ముంబైని మట్టికరిపించింది. 2010 తర్వాత చెపాక్‌ స్టేడియంలో ముంబైపై ధోనీ సేన విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. నెహల్‌ వాధేరా (64; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకంతో రాణించగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (26), స్టబ్స్‌ (20) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (0) వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌట్‌ కాగా.. కామెరూన్‌ గ్రీన్‌ (6), ఇషాన్‌ కిషన్‌ (7), టిమ్‌ డేవిడ్‌ (2) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో పతిరణ 3, దీపక్‌ చాహర్‌, తుషార్‌ దేశ్‌పాండే చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. కాన్వే (44), రుతురాజ్‌ (30), రహానే (21), శివమ్‌ దూబే (26 నాటౌట్‌) తలా కొన్ని పరుగులు చేశారు. లక్ష్యం పెద్దది కాకపోవడంతో చెన్నై ప్లేయర్లు ఆడుతూ పాడుతూ విజయ తీరాలకు చేరారు. కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ విన్నింగ్‌ రన్స్‌ చేయడంతో చెపాక్‌ స్టేడియం మోతెక్కిపోయింది. ముంబై బౌలర్లలో చావ్లా రెండు వికెట్లు పడగొట్టాడు. పతిరణకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా ఆదివారం జరుగనున్న డబుల్‌ హెడర్‌లో గుజరాత్‌తో లక్నో, రాజస్థాన్‌తో హైదరాబాద్‌ తలపడనున్నాయి.

వన్‌డౌన్‌లో దిగినా..

ఈ సీజన్‌లో బ్యాట్‌తో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరోసారి విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కలిపి ఇప్పటి వరకు కేవలం 184 పరుగులు మాత్రమే చేసిన హిట్‌మ్యాన్‌ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా కాకుండా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. అయినా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీపక్‌ చాహర్‌ బంతిని ల్యాప్‌ స్కూప్‌ ఆడే ప్రయత్నంలో జడేజాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇషాన్‌, గ్రీన్‌ విఫలం కాగా.. అనారోగ్యం కారణంగా తిలక్‌ వర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. నెహల్‌ పోరాడినా జట్టుకు పోరాడే స్కోరు అందించలేకపోయాడు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News