Home Latest News Ravindra Jadeja | జడ్డూ పునరాగమనం.. ఆర్నెళ్ల తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్న రవీంద్ర జడేజా.....

Ravindra Jadeja | జడ్డూ పునరాగమనం.. ఆర్నెళ్ల తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్న రవీంద్ర జడేజా.. అరవంలో ట్వీట్‌

Ravindra Jadeja | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌! గాయం కారణంగా ఆరునెలలుగా ఆటకు దూరమైన భారత స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. దేశవాళీ వన్డే ట్రోఫీ రంజీ టోర్నీలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్డూ.. మంగళవారం నుంచి తమిళనాడుతో ప్రారంభం కానున్న పోరులో బరిలోకి దిగనున్నాడు. గతేడాది ఆసియాకప్‌ సందర్భంగా గాయపడ్డ జడేజా.. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిహబిలేషన్‌ పూర్తి చేసుకొని ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్‌-గవాస్కర్‌’ టెస్టు సిరీస్‌ జరుగనుండగా.. జడ్డూ ఫిట్‌నెస్‌ సంతరించుకోవడం భారత బలాన్ని మరింత పెంచింది. లోయర్‌ ఆర్డర్‌తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేయడంతో పాటు.. తన స్పిన్‌తో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టగల జడ్డూ.. తన అద్భుత ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకోగలడన్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా.. రంజీ మ్యాచ్‌ ఆడేందుకు చెన్నై విచ్చేసిన సందర్భంగా ‘వణక్కం చెన్నై’ అని ట్వీట్‌ చేశాడు.

సౌరాష్ట్ర కెప్టెన్‌గా జడేజా..

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడానికి ముందు దేశవాళీల్లో పరుగుల వరదపారించి.. రంజీ ట్రోఫీలో రెండు ట్రిపుల్‌ సెంచరీలు తన పేరిట లిఖించుకున్న జడేజా.. చాలా రోజుల తర్వాత తిరిగి రంజీ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన సౌరాష్ట్ర మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి 26 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తమిళనాడు కేవలం ఒక్క విజయంతో 15 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఐదో స్థానంలో ఉంది. సౌరాష్ట్ర జట్టు నాకౌట్‌ చేరడం ఖాయం కాగా.. చివరి మ్యాచ్‌లో స్టార్‌ పేసర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. సోమవారం గంటకు పైగా నెట్స్‌లో గడిపిన జడేజా బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ‘ఈ మ్యాచ్‌కు ఉనాద్కట్‌కు విశ్రాంతినివ్వడంతో జడ్డూను సారథ్య బాధ్యతలు చేపట్టమని అడిగాం. అందుకు అతడి ఆనందంగా ఒప్పుకున్నాడు. సౌరాష్ట్ర తరఫున ఆడటం తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు’ అని సౌరాష్ట్ర కోచ్‌ నీరజ్‌ పేర్కొన్నాడు.

ఫిట్‌నెస్‌కే తొలి ప్రాధాన్యత..

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరాలంటే ఆస్ట్రేలియాతో జరుగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్‌ తప్పక గెలువాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరుగనున్న సిరీస్‌లో అన్నీ అస్త్రాలు ప్రయోగించాలనుకుంటున్న టీమ్‌ఇండియా.. అందుకు తగ్గట్లు ఆటగాళ్లపై పనిభారం పడకుండా విశ్రాంతి కల్పిస్తోంది. సోమవారం చెన్నై స్టేడియంలో ప్రాక్టీస్‌ అనంతరం జడేజా మాట్లాడుతూ.. ‘తిరిగి మైదానంలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో పాటు.. టీమ్‌ స్పిరిట్‌ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నా. ముందు వంద శాతం ఫిట్‌నెస్‌ సాధించడం ముఖ్యం.

బౌలింగ్‌, బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి సారించడానికి ముందు ఫిట్‌నెస్‌కే అధిక ప్రాధాన్యతనిస్తా. ఎన్‌సీఏలో 20 రోజులు గడిపా. బౌలింగ్‌, బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశా. అయితే మ్యాచ్‌ పరిస్థితులు వేరు, ట్రైనింగ్‌ వేరు. ఆస్ట్రేలియా సిరీస్‌ ఆరంభానికి ముందు ఎర్రబంతితో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ చేయాలనుకున్నా. అందుకే రంజీట్రోఫీలో ఆడుతున్నా. ఈ ఐదు నెలల్లో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టా. ఒక్కసారి ఆత్మవిశ్వాసం సాధిస్తే.. మరింత మెరుగవగలం. క్రీడాకారుల జీవితంలో గాయాలు సర్వసాధారణం. ఒక్కసారి మైదానంలో అడుగుపెడితే వంద శాతం కష్టపడేందుకు ప్రయత్నిస్తా, శస్త్ర చికిత్స అనంతరం తిరిగి కోలుకునే క్రమంలో క్రికెట్‌ గురించి ఎక్కువ ఆలోచించ లేదు. నా భార్యతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. దాని వల్ల కూడా గాయంపై ఎక్కువ ఆలోచన లేకుండా త్వరగా కోలుకో గలిగా’ అని అన్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kl Rahul – Athiya Shetty | ఓ ఇంటివాడైన కేఎల్‌ రాహుల్‌.. ప్రియురాలు అతియా శెట్టితో ఏడడుగులు

Sarfaraz Khan | అర్జున్‌ టెండూల్కర్‌ కంటే అదృష్టవంతుడిని నాన్నా.. తండ్రితో సర్ఫరాజ్‌ఖాన్‌ భావోద్వేగం

Vijay devarakonda | బ్లాక్‌హాక్స్‌ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ..

ICC Rankings | అగ్రస్థానానికి అడుగుదూరంలో భారత్‌ .. మూడో వన్డే నెగ్గితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ మనదే

Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

Exit mobile version