Home Latest News Sania Mirza | ‘సచిన్‌.. సచిన్‌’ తరహాలో.. ‘సానియా.. సానియా’ నామస్మరణ.. సొంతగడ్డపై చివరి మ్యాచ్‌...

Sania Mirza | ‘సచిన్‌.. సచిన్‌’ తరహాలో.. ‘సానియా.. సానియా’ నామస్మరణ.. సొంతగడ్డపై చివరి మ్యాచ్‌ ఆడిన భారత టెన్నిస్‌ దిగ్గజం

Sania Mirza | టైమ్‌ 2 న్యూస్‌, హైదరాబాద్‌: భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా కెరీర్‌కు పూర్తిగా వీడ్కోలు పలికింది. తన అసమాన ప్రతిభతో రెండు దశాబ్దాల పాటు అభిమానులను అలరించిన భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా.. సొంతగడ్డపై చివరి ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడేసింది. ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు.. 43 డబ్ల్యూటీఏ ట్రోఫీలు చేజిక్కించుకొని భారత టెన్నిస్‌లో ఎవరెస్ట్‌ అంత ఎత్తుకు ఎదిగిన సానియా.. ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఆఖరి మ్యాచ్‌ ఆడింది.

గత నెలలో దుబాయ్‌ ఓపెన్‌తోనే ప్రొఫెషనల్‌ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సానియా.. టెన్నిస్‌ ఓనమాలు నేర్చిన ఎల్బీ స్టేడియంలో ఆడాలనే ఉద్దేశంతో ఆదివారం ప్రత్యేక ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో పాల్గొంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌తో కలిసి బెతాని-ఇవాన్‌ జంటతో తలపడింది. అనంతరం రోహాన్‌ బోపన్నతో కలిసి మరో మ్యాచ్‌ ఆడింది. కెరీర్‌ చివరి రెండు మ్యాచ్‌ల్లో సానియా విజయాలు సాదించడం విశేషం.

కెరీర్‌కు వీడ్కోలు పలికినా.. ఆఖరి పోరులోనూ తన ట్రేడ్‌మార్క్‌ ఫోర్‌హ్యాండ్‌ రిటర్న్‌లు, నెట్‌ డ్రాప్స్‌తో పాటు కోర్టులో పాదరసం లాంటి చురుకైన కదలికలతో సానియా ఆకట్టుకుంది. ఈ పోరుకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయ గౌడ్‌, చాముండేశ్వరినాథ్‌, సినీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, భారత మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌, రాబిన్‌ ఊతప్ప, అనన్య బిర్లా, హుమా ఖురేషీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆత్మీయులు హజరయ్యారు. సానియా చివరిసారి ఆడుతున్న మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.

మాటలు రావడం లేదు: సానియా

మ్యాచ్‌ అనంతరం సానియా మాట్లాడుతూ.. ‘దాదాపు 20 ఏండ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ఎందరో ప్లేయర్లు దేశం తరఫున ఒక్క మ్యాచ్‌ అయినా ఆడేందుకు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి అవకాశం నాకు దక్కింది. ఇక్కడ నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. 2002 జాతీయ క్రీడల్లో ఇక్కడ పతకం సాధించా.. 2004లో డబ్ల్యూటీఏ హైదరాబాద్‌ ఓపెన్‌ టైటిల్‌ ఇక్కడే సాధించా. టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం సాహసంతో కూడిన సమయంలో నా కుటుంబం ఆ దిశగా ప్రోత్సహించింది. ఎలాంటి అవరోధాలు ఎదురైనా.. నాకు అండగా నిలబడ్డారు. ఇప్పటికి ముప్పై ఏండ్ల క్రితం అమ్మాయి ఆటలాడుతుందంటే చుట్టు పక్కల వాళ్లు ఎలాంటి సూటిపోటి మాటలు అనేవారో నాకు తెలుసు. అలాంటివి ఎన్నో దాటుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నా. అప్పట్లో ఇలా మైదానాలు ప్రేక్షకులతో నిండుతాయి అని కూడా ఊహించలేదు. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో చివరి మ్యాచ్‌ ఆడాలనుకున్నా.. నా కోరికను నిజం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్నాళ్లు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌’అని చెప్పింది. ఈ క్రమంలో అభిమానులు సానియా.. సానియా అని అరుస్తుండగా.. భావోద్వేగానికి గురైన సానియా కండ్ల నిండా నీళ్లతో తన ప్రసంగం కొనసాగించింది. ఇవి కన్నీళ్లు కావని.. ఆనంద భాష్పాలని పేర్కొంది. భవిష్యత్తులో ఈ స్టేడియం నుంచి మరెందరో సానియాలు రావాలని దేశం క్రీడలకు నెలవుగా మారాలని ఆమె ఆకాంక్షించింది. ‘ఆటకు మాత్రమే వీడ్కోలు పలికా.. మైదానం బయట టెన్నిస్‌తో నా అనుబంధం కొనసాగుతుంది. భవిష్యత్తులో తెలంగాణ క్రీడారంగానికి, భారత క్రీడారంగానికి నా సేవలందిస్తా’అని సానియా వెల్లడించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Exit mobile version