Home Latest News RCB vs DC | ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇంకా పోటీలోనే.. కోహ్లీ రికార్డు ఫిఫ్టీ కొట్టినా...

RCB vs DC | ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇంకా పోటీలోనే.. కోహ్లీ రికార్డు ఫిఫ్టీ కొట్టినా బెంగళూరుకు తప్పని ఓటమి

RCB vs DC | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: ఆశలు అడుగంటిన వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుత పోరాటం కనబరుస్తున్నది. సీజన్‌ ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమైన ఢిల్లీ.. వరుసగా రెండో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ముందుకు కదిలింది. గత మ్యాచ్‌లో గుజరాత్‌ను మట్టికరిపించిన వార్నర్‌ సేన.. శనివారం రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)ను చిత్తుచేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ (55; 5 ఫోర్లు), మహిపాల్‌ లోమ్రర్‌ (54 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించగా.. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (45; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిషెల్‌ మార్ష్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. పుట్టి పెరిగిన మైదానంలో విరాట్‌ ఆచితూచి ఆడగా.. డుప్లెసిస్‌, లోమ్రర్‌ వేగంగా పరుగులు రాబట్టారు. అయితే బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బెంగళూరు అనుకున్నంత భారీ స్కోరు చేయలేకపోయింది.

కోహ్లీ రాణించినా..

అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 187 రన్స్‌ చేసింది. ఫిల్‌ సాల్ట్‌ (45 బంతుల్లో 87; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టగా.. రాసో (35 నాటౌట్‌), మార్ష్‌ (26), వార్నర్‌ (22) తలా కొన్ని పరుగులు చేశారు. ఈ సీజన్‌లో సరైన ఓపెనింగ్‌ భాగస్వామ్యం లభించక సతమతమవుతున్న ఢిల్లీ ఈ సారి విశ్వరూపం కనబర్చింది. పృథ్వీ షా స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న సాల్ట్‌ జతగా కెప్టెన్‌ డేవిద్‌ వార్నర్‌ ఆరంభం నుంచే బెంగళూరు బౌలర్లపై యుద్ధం ప్రకటించడంతో క్యాపిటల్స్‌ స్కోరుబోర్డు రాకెట్‌ను తలపించింది. వార్నర్‌, సాల్ట్‌ పోటీపడి బౌండ్రీలు బాదడంతో ఢిల్లీ చూస్తుండగానే లక్ష్యానికి చేరువైంది. వార్నర్‌ ఔటైనా.. మిషెల్‌ మార్ష్‌, రిలీ రాసో రాణించడంతో ఢిల్లీకి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. బెంగళూరు బౌలర్లలో హజిల్‌వుడ్‌, కరణ్‌ శర్మ, హర్షల్‌ పటేల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

కింగ్‌ కోహ్లీ నయా రికార్డు

రికార్డులు సృష్టించడం వాటిని తిరగరాయడమే పనిగా పెట్టుకున్న మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ఐపీఎల్లో 7 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఢిల్లీతో పోరులో విరాట్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. దీంతో పాటు ఐపీఎల్లో 50 అర్ధశతకాలు సాధించిన రెండో ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు. సొంత మైదానంలో కుటుంబసభ్యుల సమక్షంలో విరాట్‌ ఈ ఘనత సాధించాడు. శనివారం మ్యాచ్‌లకు విరాట్‌ కుటుంబ సభ్యులు హాజరు కాగా.. ఆరుణ్‌ జైట్లీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన విరాట్‌ కోహ్లీ ఎండ్‌ నుంచి కోహ్లీ బ్యాటింగ్‌కు దిగడం విశేషం. విరాట్‌ క్రీజులో ఉన్నంతసేపు స్టేడియం కోహ్లీ నామస్మరణతో మార్మోగిపోయింది. అంతకుముందు విరాట్‌ కోహ్లీ తన చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌కు పాదాభివందనం చేసిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లీకి ప్రత్యేకమైన ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ గంట మోగించి ఆట ప్రారంభించడం కొసమెరుపు.

Exit mobile version