Home Latest News IND vs AUS | తొలి రోజు మనదే.. రోహిత్‌ హాఫ్‌ సెంచరీ.. ఆస్ట్రేలియా తొలి...

IND vs AUS | తొలి రోజు మనదే.. రోహిత్‌ హాఫ్‌ సెంచరీ.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 ఆలౌట్ ‌

IND vs AUS | టైమ్‌ 2 న్యూస్‌, నాగ్‌పూర్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌ ప్రారంభమైంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌ మొదటి రోజు టీమిండియా పైచేయి సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైంది. మార్నస్‌ లబుషేన్‌ (49) టాప్‌ స్కోరర్‌ కాగా.. స్టీవ్‌ స్మిత్‌ (37), హ్యాండ్స్‌కోంబ్‌ (31), అలెక్స్‌ కారీ (36) ఫర్వాలేదనిపించారు. ఈ నలుగురు మినహా తక్కినవాళ్లంతా.. సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. గురువారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (69 బంతుల్లో 56 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 1 సిక్సర్‌) అజేయ అర్ధశతకంతో అదరగొట్టగా.. మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (20) నిరాశ పరిచాడు. ఆసీస్‌ బౌలర్లలో టాడ్‌ మార్ఫే ఒక వికెట్‌ పడగొట్టాడు. రోహిత్‌తో పాటు నైట్‌ వాచ్‌మన్‌ అశ్విన్‌ క్రీజులో ఉన్నాడు. తొలి రోజు బౌలర్లు సత్తాచాటగా.. ఇక బ్యాటర్లపైనే భారం ఉంది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న టీమిండియా ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 100 పరుగులు వెనుకబడి ఉంది.

పేసర్ల బోణీ..

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు రెండో ఓవర్‌లోనే హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ ఝలక్‌ ఇచ్చాడు. తానేసిన తొలి బంతికే సిరాజ్‌ ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరుసటి ఓవర్‌లో షమీ కూడా ఒక అద్భుత ఇన్‌స్వింగర్‌తో వార్నర్‌ను పెవిలియన్‌ బాటపట్టించాడు. షమీ వేగానికి వార్నర్‌ వికెట్‌ గాల్లో గింగిరాలు కొట్టిన విధానం చూసి తీరాల్సిందే.

జడ్డూ కమ్‌బ్యాక్‌..

గాయం కారణంగా ఆరు నెలలుగా జట్టుకు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పునరాగమనంలో దుమ్మురేపాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసిన లబుషేన్‌తో పాటు రెన్‌షాను వరుస బంతుల్లో ఔట్‌ చేసిన జడ్డూ ఆసీస్‌ పతనానికి నాంది పలికాడు. కాసేపటికే చక్కటి బంతితో స్మిత్‌ను బుట్టులో వేసుకోవడంతో ఇక ఆసీస్‌ కోలుకోలేకపోయింది. ఇన్నాళ్ల తర్వాత మైదానంలోకి దిగినా.. టచ్‌ కోల్పోని జడేజా మాయాజాలంతో ఆసీస్‌ ఆశించినదానికంటే ముందే ఆలౌటైంది.

శ్రీకర్‌ భరత్‌ శ్రీకారం..

చాన్నాళ్లుగా భారత జట్టుతో కొనసాగుతున్న ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్‌ భరత్‌.. అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సుమారు నాలుగేండ్లుగా జట్టుతోనే ఉన్నా రిషబ్‌ పంత్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉండటంతో భరత్‌కు ఒక్కసారి కూడా తుది జట్టులో అవకాశం రాలేదు. అయితే ప్రస్తుతం కారు ప్రమాదంలో గాయపడి పంత్‌ చికిత్స పొందుతుండగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా భరత్‌ తొలిసారి భారత జట్టుకు ప్రాతనిధ్యం వహించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అపార అనుభవం ఉన్న భరత్‌ తన కీపింగ్‌ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు. వేగంగా వచ్చే జడేజా ఫ్లయిటెడ్‌ డెలివరీలను చక్కగా అందుకున్న ఈ తెలుగు కుర్రాడు. లబుషేన్‌ను స్టంపౌట్‌ చేయడం ద్వారా అంతర్జాతీయ ఖాతా తెరిచాడు.

సూర్యకు చాన్స్‌..

పొట్టి ఫార్మాట్‌లో దంచికొడుతున్న మిడిలార్డర్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు తొలిసారి టెస్టు జట్టులో చాన్స్‌ దక్కింది. గిల్‌ను ఓపెనర్‌గానే పరినణించిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌.. మిడిలార్డర్‌లో సూర్యకు అవకాశమిచ్చింది. దీంతో 30 ఏళ్లు దాటిన తర్వాత మూడు ఫార్మాట్లలో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా సూర్య రికార్డుల్లోకెక్కాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది


Exit mobile version