Home Latest News Sania Mirza | సానియా మీర్జా ప్రతిభకు యువరాజ్‌ సలాం

Sania Mirza | సానియా మీర్జా ప్రతిభకు యువరాజ్‌ సలాం

Sania Mirza | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: ఈ సీజన్‌ తర్వాత ప్రొఫెషనల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా చివరి గ్రాండ్‌స్లామ్‌ లో అదిరిపోయే ఆటతీరుతో ముందుకు దూసుకెళ్తోంది. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత సీనియర్‌ ఆటగాడు రోహాన్‌ బోపన్నతో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా తిరుగులేని ఆటతీరుతో ఫైనల్‌ చేరుకుంది. ఈ క్రమంలో భారత జంట ప్రత్యర్థులకు కేవలం ఒకే సెట్‌ కోల్పోవడం గమనార్హం.

కెరీర్‌ ఆరంభం నుంచి దశాబ్ద కాలం పాటు సింగిల్స్‌, డబుల్స్‌లో భారత నంబర్‌వన్‌గా నిలిచిన ఈ హైదరాబాదీ.. క్రీడారంగంలో అద్భుతాలు చేసేందుకు మాతృత్వం అడ్డుకాదని నిరూపిస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో సింగిల్స్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌ (2007 ఆగస్టులో)కు చేరిన సానియా.. డబుల్స్‌ (2015)లో టాప్‌ ర్యాంక్‌ కైవసం చేసుకుంది. ప్రస్తుతం 36 ఏండ్ల వయసులోనూ వన్నె తగ్గని ఆటతీరుతో విజృంభిస్తున్న సానియా.. ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ చేజిక్కించుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది.

మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మూడేసి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ కైవసం చేసుకున్న సానియా.. ఏడో ట్రోఫీ కోసం పోరాడుతోంది. 2010లో పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సానియా.. 2018లో బాబుకు జన్మనిచ్చింది. మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదించే క్రమంలో బరువు పెరిగిన సానియా.. ఆ తర్వాత తిరిగి ఫిట్‌నెస్‌ సాధించి కోర్టులో అడుగుపెట్టింది. బాబు చిన్న వయసులో అతడిని వదిలి టోర్నీలు ఆడేందుకు వెళ్లడం కష్టంగా ఉండటంతో కెరీర్‌పై పెద్దగా శ్రద్ధ చూపని ఈ హైదరాబాదీ.. ఆ తర్వాత తన ఆటతీరుతో ప్రశంసలు అందుకుంది.

సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించి ఎన్నో ఒడిదుడుకులు దాటుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన సానియా మీర్జా కెరీర్‌ ప్రారంభించిన 2003 నుంచి 2013 వరకు భారత్‌ తరఫున మహిళల సింగిల్స్‌ నంబర్‌వన్‌గా కొనసాగింది. బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లు, చాకచక్యమైన రిటర్న్‌లతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే సానియాపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సానియా ఆటతీరుపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు.

‘‘వెల్‌డన్‌ చాంప్‌.. మీలోని మరో కోణం చూస్తున్నాం. మళ్లీ కలుద్దాం’’ అని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. మెల్‌బోర్న్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌కు చేరడం సానియా మీర్జాకు ఇది ఐదోసారి కాగా.. గతం (2009)లో భారత వెటరన్‌ ఆటగాడు మహేశ్‌ భూపతితో కలిసి సానియా టైటిల్‌ నెగ్గింది. ప్రస్తుత టోర్నీలో చక్కటి ఆటతీరుతో ముందుకు సాగుతున్న సానియా-బోపన్న జంట.. శుక్రవారం జరుగనున్న మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో బ్రెజిల్‌ జోడీతో తలపడనుంది. ఈ ఒక్క మ్యాచ్‌ గెలిచి సానియా సగర్వంగా కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తోంది. ఈ క్రమంలో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో విజయం సాధించిన అనంతరం సానియా మీర్జా కుమారుడు ఇజ్‌హాన్‌ను ముద్దాడిన వీడియోను ఆస్ట్రేలియా ఓపెన్‌ నిర్వాహకులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

mohemmad siraj | ధోనీ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన సిరాజ్‌

Shubman Gill | శుభ్‌మన్ గిల్ వీర విహారం.. 10 రోజుల్లోనే విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

Women’s IPL | పురుషుల ఐపీఎల్‌ను మించిపోయిన మహిళల లీగ్‌.. రికార్డు ధరకు వేలం

Exit mobile version