Home Latest News Google Bonalu | గూగులమ్మకు బోనాలు.. వేములవాడ బద్దిపోచమ్మ గుడిలో సమర్పించిన ఫోక్‌ సింగర్స్‌ శిరీష,...

Google Bonalu | గూగులమ్మకు బోనాలు.. వేములవాడ బద్దిపోచమ్మ గుడిలో సమర్పించిన ఫోక్‌ సింగర్స్‌ శిరీష, మధుప్రియ, మౌనిక

Google Bonalu | మహంకాళి బోనాలు, పోచమ్మ బోనాలు, ఎల్లమ్మ బోనాలు, పెద్దమ్మ బోనాలు.. ఇలా గ్రామదేవతకు బోనాలు ఉంటాయి కానీ.. గూగులమ్మకి బోనాలు చేయడం ఎప్పుడైనా చూశారా? వినడానికి విడ్డూరంగా ఉంది కదూ.. కానీ మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు యూట్యూబ్‌ తల్లికి, గూగులమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయంలో పలువురు జానపద కళాకారులు, యూట్యూబర్స్‌ ఉత్సాహంగా ఈ బోనాల పండుగను నిర్వహించారు.

అసలు గూగుల్‌కు బోనాలేంటి ? ఈ ఆలోచన ఎవరికి వచ్చిందని ఆలోచిస్తున్నారా? యూట్యూబ్‌లో జానపద పాటలతో పాపులర్‌ అయిన సింగర్స్‌, కళాకారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతరించిపోతుందని అనుకున్న జానపద కళకు యూట్యూబ్‌ ఊపిరిపోసిందని.. తమను అక్కున చేర్చుకుని నాలుగు రాళ్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చిందనే కృతజ్ఞతతో గూగుల్‌ తల్లికి బోనాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు మాఘ పౌర్ణమి రోజైన ఆదివారం నాడు వేములవాడలో ఇండస్ట్రీ ఆఫ్‌ తెలంగాణ ఫోక్‌ ( ఐటీఎఫ్‌ ) ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి యూట్యూబర్స్‌ ముందుగా వేములవాడకు చేరుకున్నారు. అమరవీరుల స్తూపం నుంచి బద్దిపోచమ్మ ఆలయం వరకు బోనాలు ఎత్తుకుని ఆటపాటలతో ర్యాలీగా వెళ్లారు. భక్తిశ్రద్ధలతో గూగుల్ తల్లి పేరిట బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించారు. ఈ బోనాల వేడుకలో ఐటీఎఫ్‌ గౌరవ అధ్యక్షుడు జీఎల్ నాందేవ్‌, మాట్ల తిరుపతి, వడ్లకొండ అనిల్ తేలు విజయ, స్వర్ణ, మధుప్రియ, మౌనిక యాదవ్‌, మామిడి మౌనిక, శిరీష, బుర్ర నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version