World’s Deadliest Diseases | కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించడం మొదలై మూడేళ్లయింది. ఇప్పుడు నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది ఈ కరోనా బారినపడ్డారు. 66 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా రోజురోజుకు కరోనా విజృంభిస్తూనే ఉంది. లక్షల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజూ వేలమంది మరణిస్తూనే ఉన్నారు. ఇంత టెక్నాలజీ.. వైద్యరంగంలో అత్యాధునిక చికిత్సలు, పరిశోధనా సంస్థలు, వైద్యులు ఉన్నా చిన్న వైరస్‌ను అడ్డు తొలగించలేకపోతున్నాం. తాత్కాలిక నివారణ చర్యలు చేపడుతున్నా శాశ్వతంగా వైరస్‌ను అంతం చేసే పరిస్థితి లేదు. కానీ గతంలో చాలా మహమ్మారులు ప్రపంచాన్ని కలవరపెట్టాయి. కనుమరుగయ్యాయి. ఇప్పుడున్న ఆధునిక వ్యవస్థ కూడా అప్పట్లో లేదు, ఇంత మంది వైద్యులు లేరు, పరిశోధనలు సరిగా లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రబలిన వ్యాధులు ఎలా ఎలా అంతమయ్యాయి? బ్యాక్టీరియా, వైరస్‌లను ప్రజలు ఎలా తరిమికొట్టారు ?

జస్టీనియన్ ప్లేగు..
ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన వ్యాధుల్లో జస్టీనియన్ ప్లేగు నంబర్ వన్ స్థానంలో ఉంటుంది. క్రీ.శ 541లో ఇప్పటి ఈశాన్య యూరప్ రాజధాని కాన్‌స్టాంట్‌నోపిల్‌లో మొదటిసారి ప్లేగు వ్యాధి వెలుగులోకి వచ్చింది. యూరప్‌తో పాటు ఆసియా, ఉత్తర అమెరికా, అరేబియా దేశాలకు విస్తరించింది. దాదాపు 3 నుంచి 5 కోట్ల మంది ప్లేగు వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు క్రీ.శ 750 వరకు ప్లేగు వ్యాధి విలయతాండవం చేసింది. ఆ తర్వాత దానంతట అదే కనుమరుగైంది. అప్పట్లో రోగ నిరోధక శక్తి ఉన్నవాళ్ల ప్లేగును తట్టుకుని బయటపడగలిగారని చరిత్రకారులు చెప్పారు.

బుబోనిక్ ప్లేగు..
జస్టీనియన్ ప్లేగుకు కారణమైన యెర్సీనియా పెస్టిస్ బ్యాక్టీరియా 800 ఏళ్ల తర్వాత రూపాంతరం చెంది బుబోనిక్ ప్లేగుగా విరుచుకుపడింది. దీన్ని బ్లాక్‌డెత్‌గానూ పిలిచేవారు. 1347లో యూరప్ మొత్తం ఈ వ్యాధి వ్యాపించింది. 20 కోట్ల మంది మరణించి ఉంటారని అంచనా. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందడంతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఈ వ్యాధి సోకిన వాళ్లను దూరంగా ఉంచడం మొదలుపెట్టారు. తొలిసారి క్వారంటైన్ చేయడం అప్పటి నుంచే ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో ఒడరేవుల ద్వారా వచ్చే వాళ్లను 40 రోజులు క్వారంటైన్ చేసిన తర్వాత బుబోనిక్ ప్లేగు లక్షణాలు లేవని తెలిస్తేనే తమ ప్రాంతంలోకి అనుమతించారు. అలా వ్యాధి సోకిన వాళ్లు మరణించారు. జాగ్రత్తలు తీసుకున్న వాళ్లు మాత్రం బతికి బయటపడ్డారు. కానీ తరచూ ఆ ప్రాంతంలో ప్లేగు ప్రబలేది. అలా 300 ఏళ్లలో 40 సార్లు ప్లేగు వ్యాధి యూరప్‌పై దాడి చేసి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది.

ది గ్రేట్ ప్లేగు ఆఫ్ లండన్
యూరప్‌లో ప్లేగు విజృంభన తర్వాత తొలిసారి మళ్లీ ఇంగ్లాండ్‌లో 1665లో ఈ వ్యాధి ప్రబలింది. లండన్‌లో ఏడు నెలల వ్యవధిలోనే దీనిబారిన పడి లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి వ్యాప్తికి పిల్లులు, కుక్కలే కారణమని భావించి వాటిని చాలా వరకు చంపేశారు. కరోనా మొదట్లో బయటపడినప్పుడు ఎలాగైతే జాగ్రత్తలు తీసుకున్నారో అప్పుడు అలానే చేశారు. ప్లేగు వ్యాధి సోకిన వాళ్లను ఐసోలేట్ చేయడం, ఆ ఇంటికి ప్రత్యేక గుర్తులు పెట్టడం చేశారు. అలా తొలిసారి హోంక్వారంటైన్ లండన్‌లోనే స్టార్ట్ అయింది. ప్లేగుతో చనిపోయిన వాళ్లను ఆ ఇళ్లలోనే పూడ్చిపెట్టేశారు. అలా తీసుకున్న జాగ్రత్తల వల్లే కాలక్రమేణా దానంతట అదే తగ్గిపోయింది.

మశూచి ( Small pox )
ప్లేగు తర్వాత ప్రపంచాన్ని కలవరపెట్టిన మరో మహమ్మారి మశూచి ( Small pox ). 15వ శతాబ్దంలో యూరప్ నుంచి అమెరికా, మెక్సికో దేశాలకు మశూచి వ్యాపించింది. అంతకుముందు యూరప్, ఆసియా, అరేబియా దేశాల్లో మశూచి ఎక్కువగా ఉండేది. ఇది సోకిన ప్రతి పది మందిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయేవారు. అమెరికా, మెక్సికో ప్రజలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో ఈ వ్యాధితో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. 1796లో బ్రిటన్‌కు చెందిన ఎడ్వర్డ్ జెన్నర్ తొలిసారి మశూచికి వ్యాక్సిన్ కనిపెట్టారు. ఇది మశూచితో పోరాడేలా రోగ నిరోధక శక్తిని పెంచింది. దీంతో రెండు వందల ఏళ్లకు అంటే 1980లో మశూచి భూమిపై పూర్తిగా తొలగిపోయింది. ఒక వ్యాక్సిన్ ద్వారా ఇలాంటి మహమ్మారి తగ్గడం అదే తొలిసారి.

కలరా..
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కలరా విజృంభించింది. 19వ శతాబ్దం మొత్తం కలరా కల్లోలం సృష్టించింది. ముందుగా ఇది చెడుగాలుల ద్వారా వ్యాపిస్తుందని భావించారు. కానీ జాన్ స్నో అనే వైద్యుడు తాగునీటి ద్వారా కలరా వ్యాపిస్తుందని గుర్తించారు. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా నీటిలో ఆవాసం చేసుకోవడం, వాటిని మనిషి తాగడం వల్ల కలరా వ్యాపిస్తుందని తెలుసుకున్నారు. ఈ విషయం తెలిసి ప్రజలు పరిశుభ్రతపై అవగాహన పెంచుకున్నారు. తాగునీరు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మొదలుపెట్టారు. అలా కలరా వ్యాధికి చెక్ పడింది.

స్పానిష్ ఫ్లూ..
1918లో స్పెయిన్‌లో తొలిసారి స్పానిష్ ఫ్లూ మొదలైంది. రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరించి 5 కోట్ల మంది ప్రాణాలను బలితీసుకుంది. దానంతట అదే కనుమరుగైంది. అయితే ఈ వైరస్ సోకిన వాళ్లకు వచ్చే న్యూమోనియాకు వైద్యులు చికిత్స అందించడం వల్లనే పూర్తిగా ఫ్లూ తొలగిపోయిందని కొందరు చరిత్రకారులు చెప్పారు. ఇలా ఫ్లూ రావడం తగ్గడం సాధారణమేనని మరికొందరు వాదించారు.
Read More Articles |
Jobs Notification | తెలంగాణలో 1,365 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల..
TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు