Friday, March 29, 2024
- Advertisment -
HomeNewsAPChandrababu | తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటే నష్టం ఎవరికి ? లాభం ఎవరికి .....

Chandrababu | తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటే నష్టం ఎవరికి ? లాభం ఎవరికి .. చంద్రబాబు ఎత్తుగడ అదేనా!

Chandrababu Naidu | ఒకప్పుడు తెలంగాణలో వెలుగు వెలిగిన టీడీపీ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటుందా ? గత ఎన్నికల్లో ఆంధ్రా పార్టీగా ముద్రవేసి చీత్కరించిన పార్టీని ఇప్పుడు తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారా ? అసలు చంద్రబాబును తెలంగాణలో నమ్మే పరిస్థితి ఉందా ? గతంలో పార్టీని విడిచిపెట్టి వెళ్లిన నాయకులు, కేడర్ తిరిగి సైకిల్ ఎక్కుతారా ? ఒకవేళ ప్రజల ఆలోచన మారి చంద్రబాబును నమ్మే పరిస్థితి వస్తే ఏ పార్టీకి నష్టం జరగుతుంది ? ఏ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది ? అసలు చంద్రబాబుకు సడెన్‌గా తెలంగాణ మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది ? ఇన్నాళ్లు అంటీముట్టనట్టు ఉన్న చంద్రబాబు తెలంగాణఫై ఫోకస్ ఎందుకు పెట్టిండు ? అదీ ఖమ్మంలోనే భారీ సభ ఎందుకు పెట్టినట్లు ?

తెలుగు దేశం పార్టీ ఒకప్పుడు తెలంగాణలో వెలుగు వెలిగింది. బలమైన నాయకులు, కేడర్‌తో కళకళలాడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా టీడీపీ కేడర్ మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ బలంగానే ఉండేది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 102 స్థానాలతో అధికారంలోకి వస్తే.. తెలంగాణలో 15 చోట్ల విజయం సాధించింది. తెలంగాణలో ఓటు బ్యాంకు తగ్గినా.. క్షేత్ర స్థాయిలో కేడర్ బలంగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బిజీ కావడంతో తెలంగాణపై కొంత ఫోకస్ తగ్గించాడు. ఏపీలో అధికారంలో ఉండటంతో అక్కడి నుంచే తెలంగాణ వ్యవహారాలు చక్కబెట్టడం, తెలంగాణ నాయకులను అక్కడికే పిలిపించుకుని మాట్లాడటం, తెలంగాణలో ఎక్కువగా పర్యటించే అవకాశం రాకపోవడంతో ఇక్కడ టీడీపీ పట్ల తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దానికి తగ్గట్టుగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు తెలంగాణలో ముళ్లే మూటే సర్దుకున్నాడు.

గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు కిందస్థాయి నాయకులు, కేడర్ అంతా అధికార పార్టీలోకి డైవర్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రాపార్టీ కూల్చే ప్రయత్నం చేస్తుందన్న కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ మాట్లాడుతూ దొరికిపోవడంతో కవర్ చేసే ప్రయత్నం కూడా లేకుండా పోయింది. కేసీఆర్ మాటలు జనాల్లోకి బలంగా వెళ్లాయి. ఎవరు ఔనన్నా కాదన్నా ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబు పూర్తిగా ఏపీకే పరిమితమయ్యాడు. తెలంగాణలో పార్టీని వదిలేశాడు. 2018లో మహాకూటమి పేరుతో మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టినా.. జనాలు చీత్కరించారు. కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే.

ఇప్పడా ఖమ్మం నుంచే మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. తెలంగాణలో మొన్నటివరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉండె. కానీ తనకున్న మేధాశక్తినంతా ఉపయోగించి ధనబలంతో పాటు బీసీ వర్గాల్లో మంచి పేరున్న కాసాని జ్ఞానేశ్వర్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎంపిక చేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులు సైలెంట్‌గానే ఉన్నా ఖమ్మం సభతో మరోసారి వెలుగులోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అక్కడే సభ పెట్టడానికి కారణం ఉంది. ఖమ్మంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకే ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దు జిల్లా కావడం, మొదట్నుంచి ఖమ్మంలో కులసమీకరణల పరంగానూ టీడీపీకి కలిసొచ్చే అంశమే.

తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు లాంటి బలమైన ఆర్థిక, అంగబలమున్న నేతలు అప్పట్లో టీడీపీని ముందుండి నడిపించారు. వాళ్లు కూడా అధికార టీఆర్ఎస్‌లో చేరిపోవడంతో కేడర్‌ను నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. 2018 గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అధికారపార్టీలో చేరిపోవడంతో కేడర్ సైలెంట్ అయింది. ఇప్పడా కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు ఖమ్మంను ఎంపిక చేసుకున్నాడు చంద్రబాబు. ఖమ్మం సభను సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా టీడీపీని బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఆచితూచి అడుగులు వేశాడు. సభకు 10, 15 రోజుల ముందునుంచే ఖమ్మం జిల్లాలో బైకు ర్యాలీలు తీయడం, గ్రామగ్రామాన టీడీపీ లీడర్లను ఇంటింటికి పంపి సభకు ఆహ్వానించడం, కాసాని కూడా అక్కడే మకాం వేసి.. జనసమీకరణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది.

ఖమ్మంలో సభ పెట్టినా.. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు ర్యాలీగా వెళ్లి పార్టీలో నూతనోత్తేజాన్ని నింపే ప్రయత్నం చేయడంలో చంద్రబాబు కొంత వరకు సక్సెస్ అయిండు. సభకు కూడా భారీగానే జనం రావడంతో కేడర్ లో జోష్ నిండింది. చంద్రబాబు కూడా ఆ జనాలను చూసి ఉప్పొంగిపోయాడు. పార్టీకీ పునరుజ్జీవం ఖమ్మం నుంచే పోస్తానంటూ శపథం చేసిండు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను పినపాక మినహా 9 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇప్పటికీ కేడర్ ఉంది. 2014లో 8 నియోజకవర్గాల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. 2018లోనూ తెలంగాణ వ్యాప్తంగా రెండు సీట్లే టీడీపీ గెలిచింది. అవి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే. బలమైన నాయకులు లేకున్నా ఓటు బ్యాంకు మాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పుడా ఓటు బ్యాంకును తట్టిలేపడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పార్టీలో నూతనోత్సాహన్ని నింపాలనుకున్నాడు. కొంతవరకు సక్సెస్ అయ్యాడు.

అయితే.. ఇప్పటివరకు టీడీపీకి కేసీఆర్ వేసిన ఆంధ్రా పార్టీ అనే ముద్ర అలాగే డిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిపోవడం.. తెలంగాణ నుంచి జాతీయ పార్టీ దిశగా అడుగులు వేయడం చంద్రబాబుకు కలిసొచ్చింది. టీఆర్ఎస్ నుంచి తెలంగాణ పదాన్ని తొలగించి బీఆర్ఎస్‌గా మార్చేసుకోవడంతో.. చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టినా కేసీఆర్ నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో టీడీపీ పోటీకి దిగినా ఆంధ్రా పార్టీ అని కేసీఆర్ అనలేని పరిస్థితి. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా టీఆర్ఎస్ మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టుసాధించలేకపోయింది. అదే ఇప్పుడు టీడీపీకి కలిసొచ్చే అంశం. కాస్త ఫోకస్ పెడితే మెజారిటీ స్థానాల్లో విజయం సాధించొచ్చు అనేది చంద్రబాబు నమ్మకం.

దానికి తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు ఎక్కువైనయ్. తుమ్మల, పువ్వాడ, పొంగులేటి, నామా నాగేశ్వరరావు మధ్య పొసగడం లేదు. వీళ్లందరూ బలమైన నాయకులే . కానీ ఒకే పార్టీలో ఇమడలేకపోతున్నారు. కాబట్టి అవకాశం వస్తే.. తుమ్మల, పొంగులేటి పార్టీ మారే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని చంద్రబాబు చేజిక్కించుకోగలిగితే ఆ పార్టీకి కలిసొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్‌ను నమ్మే పరిస్థితి లేదు. అటు బీజేపీని కూడా దగ్గరికి రానివ్వరు. కాంగ్రెస్ సంగతి ఇక అంతే. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారు. అందుకే చంద్రబాబు తెలివిగా ఖమ్మాన్ని ఎంచుకున్నాడు. ఇక్కడ సభను సక్సెస్ చేస్తే కార్యకర్తల్లో జోష్ నిండటమే కాదు… బలమైన నాయకులు టీడీపీ వైపు చూసే అవకాశం ఉందని భావించినట్లున్నాడు. అంతేకాదు.. సభను విజయవంతం చేయడం ద్వారా బీజేపీ పెద్దల కళ్లలో పడే ప్లాన్ చేశాడు.

ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ ఎదుగుతోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ తన ప్రభావాన్ని చూపగలుగతోంది కానీ ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతోంది. ఈ ఐదు జిల్లాల్లో టీడీపీకి కాస్తో కూస్తో క్షేత్ర స్థాయిలో కేడర్ ఉంది. 2014లో గెలిచిన 15 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఐదు జిల్లాల్లోనే 14 ఉన్నాయి. ఇప్పుడు ఎలాగూ ఆంధ్రా పార్టీ అన్న ముద్ర లేదు కాబట్టి ఆ జిల్లాల్లో మరోసారి టీడీపీని బలపేతం చేస్తే బీజేపీ పిలిచి మరి పొత్తు పెట్టుకుంటుందనేది చంద్రబాబు ఆశ. తెలంగాణ ఎన్నికల్లో పొత్తు కుదిరితే ఏపీలోనూ బీజేపీతో కలిసి నడవొచ్చనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా చంద్రబాబు అడుగులేశాడు. పావులు కదిపాడు.

ఈ ఐదు ఉమ్మడి జిల్లాల్లో మీటింగులు పెట్టి.. టీఆర్ఎస్, కాంగ్రెస్ లో సంతోషంగా లేని నాయకులను తనవైపు ఆకర్షించుకుంటే టీడీపీకి లాభం జరిగే అవకాశం ఉంటది. గతంలో గత్యంతరం లేక పార్టీని విడిచిన వాళ్లు వచ్చే చాన్సు కూడా లేకపోలేదు. ఏపీ కంటే తెలంగాణలో ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల వరకు తన సభలు, సమావేశాలతో బలం పెంచుకుంటే బీజేపీకి దగ్గర కావొచ్చు. టీడీపీకి పట్టున్న ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్‌లో బీజేపీకి పట్టులేదు. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో బీజేపీకి అంతో ఇంతో పట్టుంది. ఏం చేసైనా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోంది. ఇప్పుడీ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయగలిగితే..బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అవుతుంది.

కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎలాగూ అట్లే ఉంటది. గతంలో టీడీపీ ఓటు బ్యాంకు అంతా టీఆర్ఎస్ కు మళ్లింది. కాబట్టి టీడీపీ బలపడితే.. నష్టపోయేది కేసీఆరే. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే మాత్రం ఈ ఐదు జిల్లాల్లో మెజారిటీ స్థానాల్లో టీడీపీ పోటీ చేసే చాన్సుంటది. మిగతా నాలుగు ఉమ్మడి జిల్లాలపై బీజేపీ ఫోకస్ పెట్టే చాన్సుంది. తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీకి కలిసి వస్తది. తద్వారా కేసీఆర్‌ను దెబ్బకొట్టొచ్చు. అలా బీజేపీ, టీడీపీ ప్లాన్ వర్కౌట్ అయ్యే చాన్సుంది.

ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌‌కు తెలంగాణ అధ్యక్షుడుగా ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయరామరావు, ఎర్ర శేఖర్ లాంటి కీలక మైన నేతలు రేవంత్ తో పాటు కాంగ్రెస్ లోకి వెళ్లారు. అధికార పార్టీలో మిగిలిన నాయకులంతా రేవంత్ రెడ్డి అండతో టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నేతలకు టీడీపీ నుంచి వచ్చిన నేతలకు మధ్య పొసగడం లేదు. ఒకవేళ చంద్రబాబు ప్లాన్ సక్సెస్ అయి.. టీడీపీ బలోపేతమయ్యే ఛాన్సుంటే.. ఆ నేతలు తిరిగి టీడీపీని వైపు చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఒకవేళ అలా వెళితే మాత్రం కాంగ్రెస్ పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవులా తయారవడం ఖాయం. ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు కచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ కు బలమైన కేడర్ ఉన్నా నడిపించే నాయకుడు లేడు. రేవంత్ రెడ్డి అంతో ఇంతో ప్రయత్నం చేద్దామని చూసినా సీనియర్లు ఆయన కాళ్లకు తాళ్లు కట్టేస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో మెజారిటీ టీడీపీ నేతలు కాంగ్రెస్ లోకే వెళ్లారు. ఇప్పుడు వాళ్లు మరోసారి టీడీపీ వైపు చూస్తే తెలుగు దేశం పార్టీ కచ్చితంగా ఓటు బ్యాంకును పెంచుకుంటది. మొత్తం మీద టీడీపీకి ప్లాన్ వర్కౌట్ అవుతది.

– ఎడిటర్

Follow Us : FacebookTwitter

Read More Articles |

Junior NTR | ఆంధ్రప్రదేశ్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలి.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

Nagarjuna | అక్కినేని నాగార్జునకు గోవా సర్పంచ్‌ నోటీసులు.. కారణమిదే..

Bharat Biotech Nasal vaccine | కరోనా విలయతాండవం చేస్తున్న వేళ గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

Harish Rao on Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డ హరీశ్‌రావు.. ఎన్టీఆర్ పేరు ఎత్తే హక్కు లేదంటూ తీవ్రస్థాయిలో ధ్వజం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News