Home Latest News Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు...

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Telangana | తన పాతివ్రత్యం నిరూపించుకునేందుకు మంటల్లో దూకాలని నాడు సీతాదేవిని శ్రీరాముడు ఆదేశించాడు. అది త్రేతాయుగం.. మాట మీద నడిచే రోజులు కాబట్టి అప్పుడు అది చెల్లింది.. కానీ ఈ కలియుగంలో కూడా ఇదే తీర్పును అమలు చేసింది ఓ గ్రామ పంచాయతీ. నువ్వు నిజంగా నిప్పులాంటి మగాడివే అయితే.. నీ భార్యను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడకపోయి ఉంటే అగ్ని పరీక్షతో నిరూపించుకో.. పతివ్రతుడివి అయితే నిన్ను ఏ నిప్పు ఏం చేయలేదు. అంటూ తీర్పునిచ్చింది. భార్య మీద అనుమానం పెంచుకుని ఓ భర్త వేసిన అభాండాలకు వంతపడింది. తెలంగాణలోని ములుగు జిల్లాలో వారం కింద జరిగిన ఈ ఆటవిక చర్య తాజాగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా బంజరుపల్లికి చెందిన జగన్నాథం కొద్ది నెలలుగా తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అదే గ్రామానికి చెందిన గంగాధర్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించాడు. చాలారోజులు ఈ విషయంతో రగిలిపోయిన జగన్నాథం.. గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. తన భార్యపై కన్నేసిన గంగాధర్‌ను శిక్షించాలని పెద్ద మనుషులను కోరాడు. దొరికిందే ఛాన్స్ అని ఇద్దరి దగ్గర డబ్బులు గుంజి తాగి తందనాలు చేయాలని గ్రామ పెద్దలు ప్లాన్ వేసుకున్నారు. పంచాయతీ చేయాలంటే ఇరు వర్గాలు రూ.11 లక్షల చొప్పున పంచాయతీకి డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. తన తప్పేమీ లేదని చెప్పినా వినకుండా గంగాధర్‌ను వేధించడం మొదలుపెట్టారు. దశలవారీగా పంచాయతీ పెట్టి నేరం అంగీకరించాలని పట్టుబట్టారు. కానీ చెయ్యని నేరం ఎందుకు ఒప్పుకోవాలని గంగాధర్ వాళ్లను ప్రశ్నించాడు. గంగాధర్ ఎదురుతిరగడంతో మూడు నెలలు అయినా పంచాయతీ ఎటు తెగలేదు. ఈ పంచాయతీని ఎలాగైనా క్లోజ్ చేయాలని ఇటీవల ఓ ఆటవిక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 25న గంగాధర్‌కు అగ్ని పరీక్ష పెట్టారు.

తప్పు చేయకపోతే ఏ నిప్పు ఏం చేయదు

నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే.. నీ భార్యతో తప్ప పరాయి స్త్రీతో ఏ సంబంధం లేకుంటే అగ్ని పరీక్ష ద్వారా నిరూపించుకోవాలని గంగాధర్‌కు సూచించారు. ఇందుకోసం ఊరి బయట కట్టెలను అంటించి అందులో ఓ గడ్డపారను ఎర్రగా కాల్చారు. ఎర్రగా కాలి నిప్పులా మెరుస్తున్న గడ్డపారను రెండు చేతులతో దూరం విసిరేయాలని ఆదేశించారు. నువ్వు నిప్పులాంటి మగాడివి అయితే నిన్ను ఏ అగ్ని ఏం చేయలేదని.. అదే జగన్నాథం భార్యతో అక్రమ సంబంధం ఉంటే గడ్డపార ముట్టుకోగానే చేతులు కాలిపోతాయని తీర్పునిచ్చారు. దీనికి గంగాధర్ ఒప్పుకోలేదు. కానీ గడ్డపార ముట్టుకోగానే గంగాధర్ చేతులు కాలుతాయి.. అతన్ని దోషి అని చెప్పి శిక్ష వేస్తే తమ పని అయిపోతుందని గ్రామ పెద్దలు అనుకున్నారు. తాము ఇచ్చిన తీర్పు పాటించి తన నిజాయితీ నిరూపించుకోవాలని గంగాధర్‌ను బలవంత పెట్టారు.

బెడిసికొట్టిన ప్లాన్.. నేరం చేశా అని ఒప్పుకోవాలని బలవంతం

ఇక చేసేదేమీ లేక.. ఎలాగైనా ఈ అపవాదు నుంచి బయటపడాలని గంగాధర్ పంచాయతీ తీర్పు పాటించాడు. ఎర్రగా కాల్చిన గడ్డపారను రెండు చేతులతో పట్టుకుని దూరం విసిరేశాడు. ఆశ్చర్యంగా గంగాధర్‌కు ఏమీ కాలేదు. అగ్నిపరీక్షలో గంగాధర్ నెగ్గడం పంచాయతీ పెద్దలకు మింగుడుపడలేదు. నిప్పును ముట్టుకుంటే ఎలాగైనా కాలుతుంది.. గంగాధర్‌ను దోషిగా నిలబెట్టవచ్చని అనుకుంటే తమ ప్లాన్ రివర్స్ కావడం సహించలేకపోయారు. జగన్నాథం భార్యతో సంబంధం ఉందని ఒప్పుకోవాలని మళ్లీ వేధించడం మొదలుపెట్టారు. పంచాయతీ పెద్దల ఆగడాలు భరించలేకపోయిన గంగాధర్ భార్య ములుగు పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం మొత్తం వాళ్లకు వివరించింది. తమ దగ్గర నుంచి డిపాజిట్‌గా తీసుకున్న డబ్బులో ఇప్పటికే రూ.6 లక్షలు ఖర్చు కూడా చేశారని ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Exit mobile version