Home News AP sudheer varma | టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్‌ వర్మ ఎలా చనిపోయాడు? అంత హడావుడిగా...

sudheer varma | టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్‌ వర్మ ఎలా చనిపోయాడు? అంత హడావుడిగా అంత్యక్రియలు ఎందుకు జరిపించారు?

sudheer varma | టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్ వర్మ మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వ్యక్తిగత సమస్యలతో సుధీర్ ఆత్మహత్య చేసుకున్నాడని మొదట వార్తలు వచ్చాయి. అయితే వాటిని సుధీర్‌ వర్మ కుటుంబ సభ్యులు ఖండించారు. అనారోగ్య సమస్యలతోనే చనిపోయాడని వాళ్లు స్పష్టంచేశారు. కానీ పోస్టుమార్టం నివేదిక మాత్రం మరోలా వచ్చింది. సుధీర్‌ వర్మ విషం తీసుకోవడం వల్ల మరణించినట్టుగా పోస్టుమార్టం రిపోర్టులో వచ్చింది. దీంతో సుధీర్‌ది ఆత్మహత్యనా? లేదా మరణం వెనుక ఇంకేదైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

అసలేమైంది?

సుధీర్ వర్మ అస్వస్థతకు గురికావడంతో ఈ నెల 20 వైజాగ్‌లోని కేజీహెచ్‌ ఎదురుగా ఉన్న ఎల్‌జీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మరణించాడు. దీంతో అతని కుటుంబసభ్యులు హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. జ్ఞానాపురం శ్మశాన వాటికలో దహన సంస్కారాలు పూర్తి చేశారు. అయితే సుధీర్‌ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త వైరల్‌ కావడంతో పోలీసులు అతని ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. ఆ సమయంలో సుధీర్‌ అనారోగ్యంతో మరణించినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. కానీ ఎల్జీ ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో సుధీర్‌ విషం తీసుకున్నట్టు వెల్లడైంది. దీంతో సుధీర్‌ వర్మ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సుధీర్ వర్మ కుందనపు బొమ్మ, సెకండ్‌ హ్యాండ్‌, షూటౌట్‌ ఎట్‌ ఆలేరు చిత్రాల్లో నటించాడు. అయితే కుందనపు బొమ్మ చిత్రంలో సుధీర్‌తో కలిసి నటించిన సుధాకర్‌ కోమాకుల సంతాపం తెలుపుతూ ట్వీట్‌ చేయడంతో ఆయన మరణవార్త బయటకొచ్చింది. ఈ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Exit mobile version