Home News AP Tirumala | తిరుమలలో లడ్డూల తయారీలో కొత్త పుంతలు.. హైటెక్ యంత్రాలు తీసుకొస్తున్న టీటీడీ

Tirumala | తిరుమలలో లడ్డూల తయారీలో కొత్త పుంతలు.. హైటెక్ యంత్రాలు తీసుకొస్తున్న టీటీడీ

Image Source : www.tirumala.org

Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే.. ఏడుకొండలపై కొలువైన వేంకటేశ్వరుడు గుర్తుకొస్తాడు. ఆ తర్వాత లడ్డూ ప్రసాదం గుర్తొస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్ని ఆలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ దొరికే లడ్డూ రుచి మరెక్కడా దొరకదు. అందుకే తిరుమలలో దొరికే లడ్డూను ఇష్టపడని వాళ్లుండరు. అందుకే ఇంతటి విశిష్టత కలిగిన ఈ లడ్డూల తయారీ, వితరణ విషయంలో టీటీడీ అధికారులు ఎక్కడా రాజీపడట్లేదు. గత 307 ఏళ్లుగా ఒకటే టేస్ట్ ఉండేలా ఈ లడ్డూలను తయారు చేయిస్తుంది. కానీ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటంతో అంతమందికి లడ్డూలను వితరణ చేయడం కష్టమైపోతుంది. అందుకే అధునాతన సాంకేతికతను ఉపయోగించి వేగంగా లడ్డూలను తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

డిసెంబర్ నాటికి హైటెక్ యంత్రాలు

తిరుమలలో లడ్డూల తయారీ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని నిర్ణయించినట్టుగా శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.50 కోట్లతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన యంత్రాలను సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. వీటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దీంతో పాటు ప్రపంచంలోనే నంబర్ వన్ స్థాయిలో తిరుమల మ్యూజియాన్ని సిద్ధం చేస్తామని ప్రకటించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మరిన్ని విషయాలను కూడా భక్తులకు ఈవో వివరించారు.

ఆనంద నిలయం బంగారు తాపడం పనులు వాయిదా

శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అతి త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామని తెలిపారు. గోవింద రాజస్వామి వారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో కొత్త టెండర్లకు వెళ్తున్నట్లు చెప్పారు. అందుకే ఆనంద నిలయం బంగారు తాపడం పనులు వాయిదా వేసినట్లు తెలిపారు.

జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారని తెలిపారు. మాడ వీధుల్లోని గ్యాలరీలన్ని పూర్తిగా నిండిపోయాయని… ఉదయం 5:30 నుంచి రాత్రి 9 వరకు భక్తులకు సప్త వాహనాల పై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి ఆనందం పొందారని చెప్పారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5 న హుండీ లెక్కింపు ఉంటుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించినట్లు చెప్పారు.

Exit mobile version