Home Latest News Minister KTR | త్వరలోనే తెలంగాణలో బీజేపీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ అవుతాయ్.. అమిత్...

Minister KTR | త్వరలోనే తెలంగాణలో బీజేపీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ అవుతాయ్.. అమిత్ షాకు మంత్రి కేటీఆర్ సెటైర్

Minister KTR | ప్రధాని అవ్వడం కాదు.. ముందు నీ సీఎం కుర్చీ కాపాడుకో అంటూ చేవేళ్లలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన విమర్శలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చేసిన వ్యాఖ్యలపైనా సెటైర్లు వేశారు. త్వరలో బీజేపీ అధికారంలోకి రావడం కాదు.. అంధకారంలోకి వెళ్తుందని ఎద్దేవా చేశారు. త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ ఖాళీ అవుతుందని.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ అవుతుందని అన్నారు.

వైఫల్యాల మోదీకి 2024లో గుజరాత్‌ ఘర్ వాపసీ తప్పదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మోదీని మరోసారి ప్రధాని పీఠం ఎక్కిస్తే.. దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టేనని ప్రజలు బలంగా నమ్ముతున్నారని స్పష్టం చేశారు. కారు స్టీరింగ్ కాదు.. బీజేపీ స్టీరింగే అదానీ చేతికి చిక్కిందని విమర్శించారు. కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం విలవిలలాడిపోతుందని ఆరోపించారు. హిండెన్‌బర్గ్ రిపోర్టుతో బీజేపీ ఫుల్ పిక్చర్‌ను దేశ ప్రజలు 70ఎంఎంలో చూసేశారని.. ఇంకా ఏ ట్రైలర్ అవసరం లేదని అన్నారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డిమాండ్‌పై కూడా మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఆదానీపై జేపీసీ వేయని బీజేపీకి సిట్టింగ్ జడ్జితో విచారణ అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. ఆదానీ విషయంలో జేపీసీ కాదు కనీసం సిట్ కూడా వేయని వాళ్లు అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో మోదీ హయాంలో మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకేజీల్లో గుజరాత్ నంబర్‌వన్‌గా ఉన్న మాట నిజం కాదా అని అమిత్ షాను నిలదీశారు. గత ఎనిమిదేళ్లలో గుజరాత్‌లో 13 సార్లు పేపర్ లీక్స్ కాలేదా అని ప్రశ్నించారు. ఈ దేశంలో వ్యాపం లాంటి అతి జుగుస్సాకరమైన స్కాం చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని అడిగారు. అటువంటి బీజేపీ నిస్సిగ్గుగా సుద్దులు మాట్లాడటం మీకే చెల్లిందని విమర్శించారు.

పీఎం కేర్స్‌లో ఎంత జమైంది? ఏ విధంగా ఖర్చు అయ్యిందో చెప్పని వారు.. కాగ్ ఆడిట్ పీఎం కేర్స్‌కు వర్తించందంటూ నిస్సిగ్గుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వారు.. కాగ్ మాత్రమే కాకుండా అన్ని రకాల బ్యాంకుల ఆడిట్‌లతో కట్టిన ప్రాజెక్టులపై మాట్లాడటం అవివేకం కాక మరేంటని బీజేపీ నాయకులను కేటీఆర్ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా.. ఇక్కడి వచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును వల్లవేస్తే నమ్మేదెవరు అని విమర్శించారు. ముక్కు నేలకు రాసినా.. మోకాళ్ల మీద యాత్ర చేసినా.. మోసాల మోదీని తెలంగాణ నమ్మదని స్పష్టం చేశారు. బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదని పేర్కొన్నారు.

Follow Us :  Google News and FacebookTwitter

Read More Articles:

Amit Shah | తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం.. కేంద్రమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Amit Shah | ప్రధాని అవ్వడం కాదు.. ముందు నీ సీఎం కుర్చీ కాపాడుకో.. కేసీఆర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా విమర్శలు

Bandi Sanjay | పులి వేట మొదలుపెట్టింది.. తెలంగాణ ప్రజల కోసం చేవెళ్ల గడ్డ మీద అడుగుపెట్టింది.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎమోషన్

Exit mobile version