Bandi Sanjay | ఆర్ఆర్ఆర్ ( RRR ) చిత్రం విశ్వవేదికపై ప్రతి భారతీయున్ని తలెత్తుకునేలా చేసింది. ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మక, ప్రఖ్యాత అవార్డు అయిన ఆస్కార్ ( Oscar2023 ) బరిలో నిలిచి చరిత్రలోకి ఎక్కింది. ఇప్పుడు తాజాగా మరోసారి సినీ ప్రపంచంలో మరో అత్యున్నత అవార్డు అయినటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్టు ( Golden Globe Awards )ను నాటునాటు ( Natu Natu ) పాట గెలుచుకోవడంతో ఎవరి నోట విన్న ఇప్పుడు ఇదే విషయం నానుతోంది. ఒకనాడు ఈ చిత్రాన్ని థియేటర్లలోకి రానివ్వం అని అన్నవారే ఈ సినిమా అవార్డులు గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేయడంతో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

అసలేం జరిగిందంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం టోపీ ధరించిన లుక్ విడుదలైనప్పుడు దానిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ టైమ్‌లో రాజమౌళిపై బండి తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. కొమురం భీమ్‌ను కించపరిచేలా రాజమౌళి సినిమా తీశారని.. నిజాం ఫోటోకు కాషాయం జెండా పెట్టి సినిమా తీసే దమ్ముందా అని నిలదీశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేస్తే థియేటర్లు తగలబెడతామని హెచ్చరించారు. కొమురం భీంను, ఆదివాసీల హక్కుల్ని కించపరిచేందుకే ఈ సినిమా తీశారని.. వారి మనోభావాలు గాయపడితే బరిసెలతో తరిమికొడతామని కూడా హెచ్చరించారు. అప్పట్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కూడా. కానీ ఈ సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా మన్ననలు దక్కడంతో బండి సంజయ్ ప్లేటు ఫిరాయించాడు. నాడు తిట్టిన నోటితోనే నేడు పొగడ్తలు కురిపించాడు.
నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడంతో బండి సంజయ్ స్పందిస్తూ.. ‘గోల్డెన్ గ్లోబ్స్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గెలిచినందుకు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయంతో మీరు భారతదేశాన్ని ప్రపంచ వేదికపై గర్వపడేలా చేశారు’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు బండి సంజయ్‌ను ట్రోల్ చేస్తున్నారు. నాడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లింకులను కామెంట్లలో పెడతున్నారు. సినిమా రాగానే లొల్లి లొల్లి చెయ్యాలి.. అవార్డులు రాగానే జబ్బలు చరుసుకోవాలి.. ఇదేనా నీ నైజం అని నిలదీస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు