Prince Harry | బ్రిటన్ ( Britain ) రాజకుటుంబంలోని కలహాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. అమెరికన్ నటి మేఘన్ మెర్కెల్ ( Meghan Markle )ను ప్రిన్స్ హ్యారీ ( Prince Harry ) పెళ్లి చేసుకోవడంతో మొదలైన విబేధాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రిన్స్ హ్యారీ తన రాచరిక విధులను వదులుకొని కుటుంబానికి దూరంగా ఉంటున్నప్పటికీ ఈ గొడవలు ఇంకా సద్దుమణగలేదని తెలుస్తోంది. మెర్కెల్ విషయంలో రాజకుటుంబంలో ఎంత పెద్ద యుద్ధం జరిగిందో తన స్వీయ చరిత్ర స్పేర్ ( Spare )లో ప్రిన్స్ హ్యారీ ప్రస్తావించిన విషయాలను గమనిస్తే అర్థమవుతోంది.

తన స్వీయ చరిత్ర స్పేర్‌ను ప్రిన్స్ హ్యారీ జనవరి 10న ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో పుస్తకంలోని పలు కీలక అంశాలపై ది గార్డియన్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. దీని ప్రకారం.. మేఘన్ మెర్కెల్ కారణంగా తన సోదరుడు ప్రిన్స్ విలియమ్ ( Prince William ) తనపై చేయి చేసుకునే పరిస్థితి కూడా వచ్చిందని ఆనాటి పరిస్థితులను పూసగుచ్చినట్టు తన స్వీయ చరిత్రలో ప్రిన్స్ హ్యారీ వివరించాడు. అమెరికన్ నటి మేఘన్ మెర్కెల్‌ను ప్రిన్స్ హ్యారీ 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మేఘన్‌ను హ్యారీ పెళ్లి చేసుకోవడం రాజకుటుంబంలో ఇష్టం లేదు. దీంతో విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే 2019లో జరిగిన ఓ సంఘటనను ప్రిన్స్ హ్యారీ తన పుస్తకంలో ప్రస్తావించాడు.

లండన్‌లోని తమ నివాసంలో ఉన్నప్పుడు మేఘన్ మెర్కెల్ విషయంలో ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీ మధ్య విబేధాలు తలెత్తాయి. మేఘన్‌ను మొరటు మనిషి అని ప్రిన్స్ విలియమ్స్ అనుచితంగా మాట్లాడాడు. ఇది హ్యారీకి నచ్చలేదు. కోపంతో మీడియాలో చెప్పిందే గుడ్డిగా నమ్ముతావా? అంటూ గట్టిగా వాదించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం బాగా ముదిరింది. సహనం కోల్పోయిన విలియమ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. హ్యారీ కాలర్ పట్టుకుని కిందకు నెట్టేశాడు. అలా తోసేయడంతో హ్యారీ వెళ్లి కుక్కు భోజనం పెట్టే గిన్నెపై పడ్డాడు. అప్పుడు గిన్నె విరిగి ముక్కలు హ్యారీ వెన్నుకు గుచ్చుకుని గాయమైంది. కష్టంగానే పైకి లేచిన హ్యారీ.. విలియమ్ మీదకు అరిచాడు. అప్పుడు విలియమ్ కూడా కోపంగానే బయటకు వెళ్లిపోయాడు. ఈ పరిణామం అంతా కూడా క్షణాల్లో జరిగిపోయిందని ప్రిన్స్ హ్యారీ తన పుస్తకంలో రాసుకొచ్చాడు.

తన గదిలో నుంచి కోపంగా వెళ్లేముందు ఈ విషయాలేవీ మేఘన్‌కు చెప్పాల్సిన అవసరం లేదంటూ అన్నాడని హ్యారీ పుస్తకంలో తెలిపాడు. తాను కూడా మేఘన్‌కు ఏమీ చెప్పలేదని.. కానీ తనకు తగిలిన గాయం చూసి జరిగిన విషయం చెప్పమని బలవంతం చేసిందని పేర్కొన్నాడు. తమ మధ్య జరిగిన వాగ్వాదం గురించి విని చాలా బాధపడిందని ఆనాటి పరిస్థితులను పుస్తకంలో రాసుకొచ్చాడు. ఇది ఒక్కటే కాదు ఇలాంటి చాలా విషయాల గురించి స్పేర్‌లో ప్రిన్స్ హ్యారీ ప్రస్తావించినట్టు ది గార్డియన్ పత్రిక తన కథనంలో పేర్కొంది.
తన ఆత్మకథ విడుదల సందర్భంగా అమెరికా, యూకేలోని పలు మీడియా ఛానళ్లకు ప్రిన్స్ హ్యారీ పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. అందులో మరికొన్ని సంచలన విషయాలను హ్యారీ బయటపెట్టాడు. రాజీ పడేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని.. రాజకుటుంబమే సిద్ధంగా లేదని పేర్కొన్నాడు. తన తండ్రి కింగ్ చార్లెస్ ( King Charles ), సోదరుడు ప్రిన్స్ విలియమ్ తో ఎప్పటిలాగే కలిసి ఉండాలని ఆశపడుతున్నాని చెప్పుకొచ్చాడు.

రాజకుటుంబంలో విబేధాలు ముదరడంతో 2020లో రాజరికాన్ని వదిలేసి హ్యారీ – మేఘన్ జంట కాలిఫోర్నియాలో స్థిరపడింది. అప్పట్నుంచి రాజకుటుంబానికి హ్యారీ దూరంగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్‌లో క్వీన్ ఎలిజబెత్ 2 మరణించినప్పుడు హ్యారీ దంపతులు లండన్ వచ్చి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. ఇది చూసిన తర్వాత ప్రిన్స్ హ్యారీ రాజకుటుంబానికి మళ్లీ దగ్గరవుతున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు తన ఆత్మకథలో ప్రస్తావించిన విషయాలను చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఈ బుక్ రిలీజయ్యాక అన్మదమ్ములు కలవడం అటుంచితే.. మరింత దూరమే పెరిగేలా కనిపిస్తోంది.
Read More Articles:
Samosa | సమోసాలో ఎలుక.. తినేప్పుడు బయటపడటంతో దడుసుకున్న కస్టమర్.. సిద్దిపేట జిల్లాలోనే!
Kamareddy | కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన.. అసలేం జరిగింది ?