Home News International Onion Price | వామ్మో కిలో ఉల్లి ధర రూ. 1200.. కొనకముందే కన్నీళ్లు పెట్టిస్తున్న...

Onion Price | వామ్మో కిలో ఉల్లి ధర రూ. 1200.. కొనకముందే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి!

Pic Source : Pixabay

Onion Price | జంధ్యాల గారి సినిమా అహ నా పెళ్లంట అందరికీ గుర్తు ఉండే ఉంటుంది కదా. ఆ చిత్రంలో కథానాయిక తండ్రి మహా పిసినారి. కోడి కూర తినాలనుకుంటే కోడిని కళ్ల ముందు వేలాడదీసుకుని ఉత్తి అన్నం తింటూ ఉంటాడు. ఆనాడు వారు ఏ అర్థంతో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారో తెలియదు కానీ.. నేడు మాత్రం ఓ దేశంలో అదే నిజమైంది.

అయితే ఇక్కడ మాత్రం కొంచెం సీన్‌ రివర్స్‌. ఎందుకంటే ఇక్కడ చికెన్‌ ప్లేట్లో పెట్టుకొని ఉల్లిపాయలను వాసన చూసి వదిలేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అది ఎక్కడో కాదు.. ఫిలిప్పీన్స్‌లో. ‘మేం రోజూ ఉల్లి తినేంత రిచ్ కాదు’ అని చలోక్తులు విసిరుకుంటున్నారు. ఇక, వివాహాలకు వెళ్తే కొత్త జంటలకు ‘ఉల్లి బొకే’ లనే కానుకులుగా అందజేస్తున్నారు.

ఎందుకంటే.. ఆ దేశంలో ఉల్లి ధరలు ఆస్థాయిలో పెరిగిపోయాయి మరి. ఫిలిప్పీన్స్‌లో ఉల్లి సంక్షోభం నెలకొంది. ఆ దేశ రాజధాని సూపర్‌ మార్కెట్లలో అయితే కేజీ ఉల్లిగడ్డలు ఏకంగా 1200 రూపాయలు ఉన్నాయి. మాంసం ధరల కంటే ఉల్లి ధరే ఎక్కువగా ఉంది. అక్కడ ఇప్పుడు ఉల్లి కోస్తేనే కాదు.. కొంటే కూడా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి.


రెస్టారెంట్లు రెసిపీల నుంచి ఉల్లి మాయమైంది. ఇక సాధారణ ప్రజలు ఉల్లిని దాదాపుగా వాడకం పక్కనపెట్టేశారు. ఫిలిప్పీన్స్‌లో ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. నేపథ్యంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇదే అదునుగా చేసుకున్న ఉల్లి రైతులు తమ వంతు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పంట సరిగా ఎదగక ముందే వాటిని తవ్వేసి అమ్మకానికి తీసుకుని వచ్చేస్తున్నారు.

దీనిగురించి ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం కూడా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. అవసరానికి సరిపడా సరఫరా ఉండేలా విదేశాల నుంచి 21 వేల టన్నుల ఉల్లి దిగుమతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉల్లి నిల్వలు ఉన్న గోడౌన్ల మీద అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉల్లిరేటు మాత్రం ఆకాశం నుంచి దిగి రావడం లేదు.

ఇక, ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు స్మగ్లర్లు. ఇటీవల మధ్య ఆసియా నుంచి మనీలాకు వచ్చిన ఓ విమానంలో ఉల్లిపాయల బస్తాలను ఎయిర్‌పోర్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా వీటిని దేశానికి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దేశీయ అవసరాలను తీర్చే స్థాయిలోనే అక్కడ ఉల్లి ఉత్పత్తి అవుతోంది. కానీ, ఫిలిప్పీన్స్లో వాతావరణ పరిస్థితుల వల్ల ఏడాదికి ఒకేసారి ఉల్లి పంట సాగుకు అవకాశం ఉంది. అధిక వర్షాల వల్ల తర్వాత సీజన్‌ కు ముందే ఉల్లి నిల్వలు పడిపోయినట్లు తెలుస్తోంది.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..!

భారత్ లో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో ఉల్లిని రైతు నుంచి రెండు రూపాయలకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. దిగుమతి ఎక్కువ కావడంతో ఉల్లి ధరలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అయితే ఉల్లిని మార్కెట్ కు తీసుకు రాలేక పొలాల్లోనే వదిలేస్తున్నారు.

మార్కెట్ కు తీసుకువస్తే ట్రాన్స్ పోర్టు ఖర్చులు కూడా రావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.

ఒక్కసారిగా ఉల్లి ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు మార్కెట్ కు తీసుకు వచ్చేందుకు కూడా వెనకంజ వేస్తున్నారు. దిగుబడి ఎక్కువ కావడంతోనే ఈ ధరలు పతనమని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతు కంట కన్నీళ్లు వస్తున్నాయి. పెట్టుబడులు సంగతి అటుంచి మార్కెట్ కు తీసుకు వచ్చిన రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో తమకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Doctor Preethi | డాక్టర్‌ ప్రీతి కేసులో కీలక మలుపు.. లభించిన ఆధారం!

WPL 2023 | అవే సీన్స్‌ రిపీట్‌.. ఐపీఎల్‌ ఆరంభ పోరులో జరిగినట్లే ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లోనూ జరిగాయి !

WPL 2023 | డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌కు అదిరిపోయే ఆరంభం.. బోణీ కొట్టిన ముంబై

Marriage | పెళ్లి కోసం వెరైటీ మేకప్ ట్రై చేసిన పెళ్లి కూతురు.. దడుసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు!

Manchu Manoj | సైలెంట్‌గా మంచు మనోజ్‌, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్‌

Saif Ali Khan | మీడియాపై సైఫ్‌ అలీ ఖాన్ అసహనం‌.. ఇంకెందుకు లేటు.. మా బెడ్ రూమ్‌లోకి రండి అంటూ ఆగ్రహం!

Exit mobile version