Home News AP Kotamreddy | నేను వచ్చిందే ధర్నాల నుంచి అని తెలుసుకో.. ఆదాల ప్రభాకర్‌ రెడ్డిపై కోటంరెడ్డి...

Kotamreddy | నేను వచ్చిందే ధర్నాల నుంచి అని తెలుసుకో.. ఆదాల ప్రభాకర్‌ రెడ్డిపై కోటంరెడ్డి ఫైర్

Kotamreddy | రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తన తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుందని చెప్పారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభుత్వ ఆరోపణలు చేస్తున్న కోటంరెడ్డి.. తాజాగా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. అసలు ఆదాల ఏ పార్టీతో ఉంటున్నారో, ఏ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నీకు వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చు

పోయిన ఎన్నికల సమయంలో టీడీపీ బీఫామ్‌ ను జేబులో పెట్టుకుని జగన్‌ను కలిసిన ఘనత ఆదాలది అని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి కూడా తన గురించే మాట్లాడుతున్నాడని విమర్శించారు. పులివెందుల రౌడీ జగన్, నెల్లూరు రౌడీ కోటంరెడ్డి అని గతంలో ఆదాల చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయని చెప్పారు. ఇలాంటి వ్యక్తి వైసీపీలోనే కొనసాగుతారనే నమ్మకం తనకు లేదని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఒకే పార్టీలో ఉండాలని.. గతంలో మాదిరి అన్ని పార్టీలు తిరగొద్దని హితవుపలికారు. ఆదాలకు వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చని.. తనకు అంతకంటే విలువైన నియోజకవర్గ ప్రజల అభిమానం ఉందని చెప్పారు. తాను ఎవరినీ శత్రువుగా భావించనని.. కేవలం రాజకీయ పోటీదారుడిగానే చూస్తానని అన్నారు కోటంరెడ్డి.

ధర్నాల నుంచి వచ్చా అని తెలుసుకో

తాను వచ్చిందే ధర్నాల నుంచి అన్న విషయం ఆదాల తెలుసుకోవడం మంచిదని కోటంరెడ్డి అన్నారు. ధర్నాలు, నిరసనలు, గాంధీగిరి తనకు కొత్త కాదన్నారు. ప్రజల పక్షాన ఎప్పటికీ నిలుస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కాంట్రాక్టర్‌గా, ఎంపీగా తనకు తెలుసునని, కానీ ఆయన కొత్త అవతారం జాతకాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నారో తనకు తెలియదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ రూరల్ అభ్యర్థిగా వాడవాడలా తిరిగిన ఆదాల.. జగన్‌ను, నన్ను ఇష్టారీతిన తిట్టి.. ఆ తర్వాత వైసీపీలో చేరిన మీరు నా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో టీడీపీ బీఫారమ్ జేబులో పెట్టుకొని, వైసీపీలో చేరిన మీరు.. 2024లో అలా చేయనని, వైసీపీ నుంచే పోటీ చేస్తానని మీరు చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు అలా చెబితే నేను మరోమారు మీ గురించి మాట్లాడేది లేదని సవాలు విసిరారు. అయితే కోటంరెడ్డి వ్యాఖ్యలపై ఆదాల స్పందించారు. తాను వైసీపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి అబద్దాలు మాట్లాడటం తప్పు అని విమర్శించారు.

ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేశా

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన స్నేహితుడు రామశివారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌నే ఆయన చదివారని ఆరోపించారు. తాను అత్యంత కష్టాల్లో ఉన్న ఈ సమయంలో మేయర్‌తో సహా 11 మంది కార్పొరేటర్లు తన వెంట వచ్చారని, ఇందుకు వారికి థ్యాంక్స్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను చెప్పినట్లుగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని, దొంగచాటుగా తన మాటలు విన్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని మీరు మనస్ఫూర్తిగా నమ్మి.. రాష్ట్ర ప్రభుత్వమే హోంశాఖకు లేఖ రాసి ఉండేదన్నారు. నేను ఈ వ్యవహారంలో విచారణ కోరుతుంటే.. తాను ఎవరితో మాట్లాడారో.. ఆ వ్యక్తిని తీసుకు వచ్చారని, ఆ వ్యక్తి చెప్పినంత మాత్రాన నిజమవుతుందా అని ప్రశ్నించారు. మీరు కేంద్ర హోంశాఖకు లేఖ రాసేందుకు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని నిలదీశారు.

సజ్జలగారూ.. నా రుణం తీర్చుకున్నందుకు థ్యాంక్స్

అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, పత్రికాధిపతులు, చివరకు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని, ఒకరితో మరొకరు మామూలు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుకునే పరిస్థితి లేదని కోటంరెడ్డి అన్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి నిజాయితీని నిరూపించుకోవాల్సిందన్నారు. అలా లేఖ రాస్తే.. తనతో పాటు ఫోన్ ట్యాపింగ్ చేసిన అందరి వివరాలు బయటపడతాయనే భయం ఉన్నట్లుగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పరోక్షంగా చెప్పడానికి తన స్నేహితుడికి స్క్రిప్ట్ ఇచ్చిన సజ్జలకు తాను థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. సజ్జల గారూ… మీరు ఇచ్చిన స్క్రిప్ట్ నాకు మేలు చేసిందని కోటంరెడ్డి అన్నారు. గతంలో తనపై ఉన్న అభిమానమో, వైసీపీలో కొనసాగిన సమయంలో తనకు ఏం చేయనందుకో.. ఏదైతేనేం.. తన రుణం మీరు ఇలా తీర్చుకొని ఉంటారన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSRTC | పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్‌!

Cow Hug Day | లవర్స్‌కి అలర్ట్‌.. భారత్‌లో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట.. కౌ హగ్‌ డేనట.. అందరూ ఇలా చేయాలన్న పశుసంవర్ధక శాఖ!

Narendra Modi | దేశం కోసమే నా జీవితం అంకితం చేశా.. కాంగ్రెస్‌ వల్ల దశాబ్ద కాలాన్ని కోల్పోయాం.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్‌!

Transgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న అతని భార్య

Exit mobile version