Home Latest News Budget 2023 | పొరపాటున గత ఏడాది బడ్జెట్‌ చదివిన సీఎం.. విపక్షాల ఆందోళన

Budget 2023 | పొరపాటున గత ఏడాది బడ్జెట్‌ చదివిన సీఎం.. విపక్షాల ఆందోళన

Budget 2023 |రాజస్థాన్ అసెంబ్లీలో శుక్రవారం పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ బడ్జెట్ ను చదవడం ప్రారంభించారు. అంతే బీజేపీ నేతలు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ఈ సంవత్సరానిది కాదని.. గతేడాది బడ్జెట్ ను చదువుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

సీఎం గత ఏడాది బడ్జెట్‌ చదువుతుండటంతో బీజేపీ నేతలు ఒక్కసారిగా వెల్ లోకి ప్రవేశించి రచ్చ చేశారు. ఆఖరికి ఈ విషయాన్ని మంత్రి మహేశ్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో సభను స్పీకర్ అరగంట పాటు వాయిదా వేశారు. బడ్జెట్ కాపీని తీసుకురావడంలో అధికారులు హడావిడి చేసిన సమయంలో బడ్జెట్ సాంకేతికంగా లీక్ అయ్యిందని బీజేపీ ఆరోపించింది. సీఎం తప్ప మరెవరూ బడ్జెట్ కాపీని తీసుకుని రాకూడదని బీజేపీ పేర్కొంది. కానీ బడ్జెట్ ఐదారుగురి చేతుల్లోకి వెళ్లిపోయిందని ఛబ్రా ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రతాప్ సింఘ్వి ఆరోపించారు. కొత్త బడ్జెట్ ని తీసుకుని రావాల్సిందేనని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

సభ తిరిగి మొదలైన తరువాత బీజేపీ ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు. బడ్జెట్ లో ఎలాంటి లీక్ జరగలేదని ఆయన అన్నారు. తాజా బడ్జెట్ పత్రాల్లో సూచన కోసం గతేడాది బడ్జెట్ నుంచి అడిషనల్ పేజీని కలిపినట్లు తెలిపారు. రాజస్థాన్ అభివృద్ధికి, ప్రగతికి తాము ఎన్నటికీ వ్యతిరేకమని బీజేపీ చూపించాలనుకుంటోందని మండిపడ్డారు.

Exit mobile version