Home Latest News KCR | ఇది రాజకీయం కాదు.. దేశ ప్రజల జీవన్మరణ సమస్య.. నాందేడ్‌ సభలో సీఎం...

KCR | ఇది రాజకీయం కాదు.. దేశ ప్రజల జీవన్మరణ సమస్య.. నాందేడ్‌ సభలో సీఎం కేసీఆర్‌

KCR | దేశంలో వెనుకబాటుతనానికి కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలే కారణమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో సాగు, తాగు నీటి కోసం కష్టాలేనా అంటూ ప్రశ్నించారు. దీనికి కారణం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలేనని విమర్శించారు. ఒకరు అంబానీ అంటే మరొకరు అదానీ అంటున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాందెడ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని గురుగోవింద్‌ సింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో నాయకత్వ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుత నేతలు మాటలకే పరిమితమవుతున్నారని, దేశంలో నాయకత్వ మార్పు రావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని, ఇందుకు కారణం ఎవరని కేసీఆర్‌ ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎందుకీ దుస్థితి వచ్చిందని ప్రశ్నించారు. కేంద్రంలో పార్టీలు మారినా, ప్రధానులు మారినా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదన్నారు. ప్రజలకు సమస్యలు అర్థమైనప్పుడు మేం బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదని కేసీఆర్‌ హెచ్చరించారు.

చిత్తశుద్దితో పనిచేస్తే అమెరికాను దాటొచ్చు

విస్తీర్ణంలో మన కంటే అమెరికా చాలా పెద్దది కానీ వ్యవసాయానికి పనికొచ్చే భూమిలేదని కేసీఆర్‌ అన్నారు. భారత్‌ పేద దేశం ఎంతమాత్రం కాదని, చిత్తశుద్ధితో పనిచేస్తే అమెరికా కంటే ఎక్కువ అభివృద్ది చెందొచ్చు అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 4 వేల టీఎంసీల రిజర్వాయర్లు చాలా దేశాల్లో ఉన్నాయని, కానీ భారత్‌లో 2వేల టీఎంసీల రిజర్వాయర్‌ కూడా ఎందుకు లేదు అని ప్రశ్నించారు. భారత్‌లో రిజర్వాయార్లు పెరగలేదు కానీ ట్రైబ్యునల్స్‌, నదీ జలాల వివాదాలు పెరిగిపోయాయని అన్నారు. కేంద్రం ట్రైబ్యునళ్ల పేరుతో చేతులు దులుపుకుంటోందని అన్నారు. రిజర్వాయర్లు కట్టాలంటే కేంద్రం అనుమతుల పేరుతో కాలయాపన చేస్తోందని, అనుమతులు రావడానికే 30 ఏళ్లు పడుతోందని మండిపడ్డారు.

దేశంలో రైతు రాజ్యం రావాలి

మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, దీనికి కారణం ఎవరని కేసీఆర్‌ ప్రశ్నించారు. మహారాష్ట్రలో బీడ్‌, లాథూర్‌, పర్బనీ వంటి ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితే ఉండేదని కానీ తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో మార్పు వచ్చిందన్నారు. రైతు రాజ్యం వస్తేనే మహారాష్ట్రలో రైతుల పరిస్థితి బాగుపడుతుందన్నారు. తెలంగాణలో ఇప్పుడు తాగు, సాగు నీటికి కష్టాలు లేవని.. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నామని అన్నారు. రైతు బీమా, రైతుబంధుతో ఆదుకుంటున్నామని చెప్పారు. రైతు చనిపోయిన నాలుగు రోజుల్లో బీమా డబ్బులు ఇస్తున్నామని అన్నారు. రైతులు పండించిన పంటను పూర్తిగా ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. ఇలాంటివి తెలంగాణలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కావు అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

మేకిన్‌ ఇండియా జోకిన్‌ ఇండియాగా మారింది

పంటను రైతులే పండించి రైతులే అమ్ముకోవాలని అప్పుడే రైతు రాజ్యం సాధ్యమవుతుందన్నారు. మన్‌కీ బాత్‌తో దేశ ప్రజలను వంచిస్తున్నారని కేసీఆర్‌ ఆరోపించారు. ఇది రాజకీయం కాదు.. జీవన్మరణ సమస్య అని అన్నారు. మేకిన్‌ ఇండియా జోకిన్‌ ఇండియాగా మారిపోయిందని ధ్వజమెత్తారు. చిన్న చిన్న పట్టణాల్లోనూ చైనా బజార్‌లు ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నించారు. పతంగులకు కట్టే మాంజాల నుంచి జాతీయ జెండాల వరకు చైనా నుంచే రావడం సిగ్గుచేట్టన్నారు. ఇలాంటి పరిస్థితి మారాలని, దేశంలో చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలన్నారు.

కరెంట్‌ కోతల వెనుక కుట్ర ఎవరిది

దేశంలో కావాల్సినంత బొగ్గు ఉందని. కానీ కరెంట్‌ మాత్రం ఎందుకు రావడం లేదో చెప్పాలని అన్నారు. దీని వెనుక దాగి ఉన్న కుట్రలేందని ప్రశ్నించారు. దేశంలో బీఆర్‌ఎస్‌ సర్కారు రాంగనే ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలంటే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని, ఒక్క బటన్‌ నొక్కితే దేశమంతా మారిపోతుందన్నారు. తెలంగాణలో సాధ్యమైనవన్నీ మహారాష్ట్రలో అమలు చేయాలని అన్నారు.

రైతులను మోదీ పట్టించుకోలేదు

నాయకులు ఎక్కడి నుంచో రారని, మీ నుంచే వస్తారంటూ బాల్క సుమన్‌ను గురించి చెబుతూ యువతలో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్‌. కాలేజీలో చదువుతూనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చిన్న వయసులోనే ఎంపీ అయ్యాడని , ఎమ్మెల్యేగా కూడా గెలుపొందాడని అన్నారు. ప్రతిఒక్కరు గులాబీ జెండా భుజాన వేసుకుని కదలి రావాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో 5 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంటే రైతులకు 10 వేల రూపాయలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. రైతులను ఆధుకోవాలంటే మనసు ఉండాలని అన్నారు. ఢిల్లీలో ఏడాదికి పైగా రైతులు ఆందోళన చేసినా ప్రధాని మోదీ పట్టించుకోలేదని మండిపడ్డారు. చనిపోయిన రైతులను కూడా మోదీ ఆదుకోలేదని అన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Traffic Challan | వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ ఛలాన్లపై 50 శాతం డిస్కౌంట్

Transgender Pregnant | అబ్బాయిగా మారిన తర్వాత గర్బం దాల్చిన ట్రాన్స్‌జెండర్.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మ

Anand Mahindra | హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నాడంటే

Breaking News | పండుగ నాడు ఉచిత చీరల పంపిణీ… తొక్కిసలాటలో నలుగురు మృతి!

Vani Jairam | వాణీ జయరాం కుటుంబ నేపథ్యం తెలుసా.. ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది!

Exit mobile version