Home News MI vs PBKS | ముంబై బ్యాటింగ్‌ లైనపా మజాకా.. దంచికొట్టిన ఇషాన్‌, సూర్య

MI vs PBKS | ముంబై బ్యాటింగ్‌ లైనపా మజాకా.. దంచికొట్టిన ఇషాన్‌, సూర్య

MI vs PBKS | టైమ్‌ 2 న్యూస్‌, మొహాలీ: ఇరు జట్లు కలిసి 430 పరుగులు చేసిన మ్యాచ్‌లో ఆధిక్యం కనబర్చిన రోహిత్‌ సేన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన రెండో పోరులో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తుచేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (42 బంతుల్లో 82 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ముంబై బౌలర్లను ఊచకోత కోయగా.. జితేశ్‌ శర్మ (27 బంతుల్లో 49 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (30; 5 ఫోర్లు), మాథ్యూ షార్ట్‌ (27; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించారు. 12 ఓవర్లు ముగిసేసరికి 99/3తో నిలిచిన పంజాబ్‌.. ఆ తర్వాత 48 బంతుల్లో వికెట్‌ నష్టపోకుండా 115 పరుగులు రాబట్టి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బౌలర్లలో పియూష్‌ చావ్లా రెండు వికెట్లు పడగొట్టాడు. గంపెడు ఆశలు పెట్టుకున్న స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ 4 ఓవర్లలో 56 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసింది. ఐపీఎల్లో ముంబై తరఫున 200వ మ్యాచ్‌ ఆడిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగగా.. ఇషాన్‌ కిషన్‌ (41 బంతుల్లో 75; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. చివర్లో తిలక్‌ వర్మ (10 బంతుల్లో 26 నాటౌట్‌; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (10 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు) లాంఛనం పూర్తిచేశారు. పంజాబ్‌ బౌలర్లలో ఎలీస్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

రెండు భాగస్వామ్యాలు

ఇరు జట్లలోనూ ఒక్కో భాగస్వామ్యమే మ్యాచ్‌ గతిని మార్చింది. ముంబై స్పిన్నర్ల ధాటికి ఒక దశలో తక్కువ పరుగులకే పరిమితమయ్యేలా కనిపించిన పంజాబ్‌.. లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ భాగస్వామ్యంతో భారీ స్కోరు నమోదు చేసింది. ఈ జంట నాలుగో వికెట్‌కు 53 బంతుల్లో 119 పరుగులు జోడించింది. లివింగ్‌స్టోన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగగా.. జితేశ్‌ శర్మ అతడికి చక్కటి సహకారం అందించాడు. దీంతో మొహాలీ స్టేడియం మోతెక్కిపోయింది. ఇక భారీ లక్ష్యఛేదనలో పరుగుల ఖాతా తెరవకుండానే ముంబై కెప్టెన్‌ పెవిలియన్‌ బాటపట్టగా.. కామెరూన్‌ గ్రీన్‌ కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఈ దశలో జతకూడిన ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ మ్యాచ్‌ గమనాన్ని మార్చేశారు. అప్పటికే మంచి జోరుమీదున్న ఇషాన్‌కు సూర్య తోడవడంతో ముంబై స్కోరు బోర్డు రాకెట్‌ను తలపించింది. బౌలర్‌తో సంబంధం లేకుండా ఈ జంట బౌండ్రీలతో రెచ్చిపోయింది. ఈ క్రమంలో ఇషాన్‌ 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. సామ్‌ కరన్‌ వేసిన ఓవర్లో 6,6,4,4తో సూర్యకుమార్‌ 23 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. మూడో వికెట్‌కు 55 బంతుల్లో 116 పరుగులు జోడించిన అనంతరం సూర్యకుమార్‌ ఔట్‌ కాగా.. కాసేపటికే ఇషాన్‌ అతడిని అనుసరించాడు. ఈ దశలో తెలంగాణ కుర్రాడు తిలక్‌ వర్మ 6,4,6తో విజయ సమీకరణాన్ని సులభతరం చేశాడు.

Exit mobile version