Home Latest News Mumbai Indians | ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టు అదే.. డబ్ల్యూపీఎల్‌లో ముంబై వరుసగా...

Mumbai Indians | ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టు అదే.. డబ్ల్యూపీఎల్‌లో ముంబై వరుసగా ఐదో విజయం

Mumbai Indians | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ దూసుకెళ్తోంది. తొలిసారి నిర్వహిస్తున్న లీగ్‌లో పరాజయం అన్నదే ఎరుగకుండా జైత్రయాత్ర సాగిస్తున్న ముంబై మంగళవారం 55 పరుగుల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. లీగ్‌ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ముంబై ఇండియన్స్‌.. పది పాయింట్లతోమరో మూడు మ్యాచ్‌లు మిగిలుండగానే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది.

తాజా పోరులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. యస్తిక భాటియా (44; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌), స్కీవర్‌ బ్రంట్‌ (36; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) సత్తాచాటారు. గుజరాత్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్నేహ్‌ రాణా (20), హర్లీన్‌ డియోల్‌ (22), సుష్మ వర్మ (18 నాటౌట్‌), సబ్బినేని మేఘన (16) కాస్త పోరాడినా.. ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి గుజరాత్‌ పనిపట్టారు. బ్రంట్‌, మాథ్యూస్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది.

తిరుగులేని హర్మన్‌ బృందం..

విధ్వంసక ఓపెనర్‌ హీలీ మాథ్యూస్‌ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగగా.. యస్తిక, బ్రంట్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలతో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం బ్రంట్‌ ఔట్‌ కాగా.. కాసేపటికే యస్తిక రనౌట్‌ రూపంలో వెనుదిరిగింది. ఈ దశలో గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకోవడంతో పరుగుల రాక కష్టమైంది. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై 101/3తో నిలిచింది. ఇక భారీ స్కోరు చేయడం కష్టమే అనుకుంటున్న తరుణంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. గార్డ్‌నర్‌, సదర్‌లాండ్‌ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదిన హర్మన్‌ చివరి ఓవర్‌లో ఔటయ్యేంత వరకు అదే దూకుడు కొనసాగించింది. సదర్‌లాండ్‌ వేసిన 19వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన హర్మన్‌.. ఆఖరి ఓవర్‌లో బౌండ్రీతో 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. అనంతరం గుజరాత్‌ ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. జట్టు ఎంపిక విషయంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుజరాత్‌ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయాన్ని ఆహ్వానించింది. 20 ఓవర్లు క్రీజులో నిలిచినా.. లక్ష్యానికి 55 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

TSPSC Paper Leak | ఏఈ పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ మొబైల్‌లో యువతుల ఫోన్ నంబర్లు, నగ్న చిత్రాలు

Mohammed Siraj | గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని: సిరాజ్‌

Exit mobile version