Thursday, March 28, 2024
- Advertisment -
HomeNewsAPKandukuru stampede incident | కందుకూరు తొక్కిసలాటలో అమాయకుల మృతికి కారణమెవరు? ప్రచార పిచ్చే కొంపలు...

Kandukuru stampede incident | కందుకూరు తొక్కిసలాటలో అమాయకుల మృతికి కారణమెవరు? ప్రచార పిచ్చే కొంపలు ముంచుతోందా ?

Kandukuru stampede incident | తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మారిపోతున్నాయా? ప్రచార పిచ్చి నాయకులను వదలడం లేదా ? గోరంతను కొండంతగా చూపిస్తేనే జనాలు నమ్ముతున్నారా? వాస్తవాల కంటే గాసిప్పులే స్ట్రెయిట్‌గా జనాల్లోకి వెళ్తున్నాయా? ఓట్లు పడాలంటే గారడీలు చేయాల్సిందేనా ? మాటల కంటే మాయలే ఓట్లు రాబడుతున్నాయా ? జనాల ఇబ్బందులు నాయకులకు అక్కర్లేదా ? నాయకుల మాటలు జనాలకు అక్కర్లేదా ? హడావిడే అందరికీ కావాలా? అమాయకులే దీనికి బలైపోవాలా?

రాజకీయ నాయకులేం ఆలోచిస్తున్నారు ? జనాలెటువైపు వెళ్తున్నారు ? ఒకప్పుడు రాజకీయ పార్టీల ప్రచారమైనా, సభలైనా ఆ ఊరిలో ఖాళీ జాగ ఎక్కడుంది? అందుబాటులో పెద్ద గ్రౌండులున్నయా అని ఆలోచించేటోళ్లు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా.? ఎంత తక్కువ ప్లేసుంటే అంత బెటరని ఎందుకు ఆలోచిస్తున్నరు ? ఇరుకు సందులవైపు నాయకులు ఎందుకు పరుగెడుతున్నారు? అంతా.. మాయ! ఓట్ల వేటలో జనాలకు గాలం వేసేందుకే. అది కూడా అర్థం చేసుకోలేని వెర్రి జనాలు.. వాళ్లు, వాళ్ల కుటుంబాల సంగతేందన్న సోయి లేకుండా ఎగపడుతున్నారు. నచ్చిన నాయకుడు ఏం చెప్పినా ఏమాత్రం ఆలోచించకుండా జిందాబాద్‌లు కొట్టేందుకు పరుగులుపెడుతున్నారు. ఆ వీక్‌నెస్‌నే క్యాచ్చేసుకునేందుకు నాయకులు పరితపిస్తున్నారు. అందులో భాగమే ఈ ప్రచార పిచ్చి.

ఖాళీ జాగలు, పెద్ద పెద్ద గ్రౌండులో సభలు పెడితే జనాలు తక్కువ కనిపిస్తారు. అదే చిన్న చిన్న గల్లీలైతే తక్కువ మంది వచ్చినా.. చాలా ఎక్కువే వచ్చినట్లు కనిపిస్తుంది. దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో డంకా బజాయించుకోవచ్చు. జనాలు భారీగా వచ్చేస్తున్నారు.. మా నాయకుడిని, మా పార్టీని నమ్మేస్తున్నారని పిచ్చి భ్రమల్లో బతికేయొచ్చు. అలా వైడ్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను వాడుతూ సభలకు భారీగా జనాలు వచ్చారన్న భ్రమను కల్పిస్తేనే జనాలు కూడా నమ్మే పరిస్థితి ఉంది. అలాంటి గారడీలకే జనాల ఓట్లు పడే పరిస్థితి ఉంది. అందుకే నాయకులు అలాంటి మార్గాలవైపు తొంగి చూస్తున్నారు. చిన్న చిన్న గల్లీలను ఎంపిక చేసుకుని అందులో ఈగలు వాలేందుకు కూడా స్థలం లేనంతగా జనాలను నింపేసి కెమెరా పనితనాలతో జనాలను మైమరిపిస్తున్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో కాదు అన్ని రాజకీయ పార్టీలు ఇదే ఫార్ములాను ప్రయోగిస్తున్నాయి.

గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇదే ఫార్ములాను ఉపయోగించాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పాదయాత్రకు అంతగా జనాలు ఎందుకు వస్తున్నారని అందరూ అనుకున్నారు. అందరి మదిలోనూ అదే అనుమానం. వాస్తవంగా జనాలు వచ్చినా.. అంతకుమించి కెమెరాల పనితనమే అక్కడ పనిచేసింది. రహదారులనే రాజకీయ సభలకు వాడుకుని జనాలు ఎక్కువగా కనిపించే ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యారు. ఇప్పుడదే బాటలో టీడీపీ అధినేత చంద్రబాబు పయనిస్తున్నారు. ప్రజల కష్టాల గురించి పక్కనపెడితే బలనిరూపణే ద్యేయంగా ముందుకు సాగుతున్నారు. భారీగా జనాదరణ ఉందని నిరూపించుకుని ఎన్నికల్లో గెలవొచ్చన్న ఆశతో ముందుకు వెళుతున్నారు. జనాలు కూడా అట్లాగే తయారయ్యారు. భారీగా జనాలు వచ్చినట్లు చూపించే పార్టీలనే నమ్మేస్తున్నారు. అందుకే ఇరుకు గల్లీల్లో రోడ్ షోలవైపు మొగ్గుచూపుతున్నారు. రాజకీయ నాయకులు చేస్తున్నవి పైకి రోడ్ షోలా కనిపిస్తున్నా.. దాని వెనుక నాయకుల, పార్టీల షోకేజీనే ఎక్కువుంటుంది.

తెలంగాణలో షర్మిల, బండి సంజయ్ కూడా ఇదే పంథాను ఎంచుకున్నారు. పాదయాత్రల పేరుతో చిన్న చిన్న గల్లీల్లో సభలు పెట్టి భారీగా జనాలు వచ్చినట్లు చూపిస్తున్నారు. వాస్తవానికి ఆ ఊరు, ఆ పట్టణానికి సంబంధించిన జనాలు వచ్చినా.. అంతుకుమించి చూపించే ప్రయత్నమే చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, వైడ్ యాంగిల్స్ అంటూ జానాలను బుట్టలో వేసుకునేందుకు మాయ చేసేస్తున్నారు. ఇక కేసీఆర్‌ ఇటీవలి కాలంలో రోడ్‌షోలైతే చేయలేదు. ఆ అవసరం కూడా ఇప్పటివరకు ఆయనకు రాలేదు. అలాంటి మాయ నుంచి బయట పడదామా.. వరదలో బురదలా అట్లాగే కొట్టుకుపోదామా?

తక్కువ ప్లేసులో భారీగా జనాలను నింపేసినప్పడు ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితేంది? ఇప్పుడు కందుకూరు రోడ్ షోలోనూ అదే జరిగింది. 8 మంది అమాయకులు బలైపోయారు. రాజకీయ నాయకులు నాలుగు రోజులు పరామర్శించి, తలో కొంత ఆర్థిక సాయం చేసి వెళ్లిపోతారు. వాళ్ల పనుల్లో వాళ్లు బిజీ అయితారు. కానీ ఆ కుటుంబాల పరిస్థితేంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి.. పిల్లలను పోషించే పరిస్థితి లేని వారి పరిస్థితేంది? జీవితాంతం నరకమే కదా.? ఈ ఘటనతోనైనా మేల్కొంటే బెటర్. ఇరుకైనా మనసుతో కాదు.. విశాల హృదయంతో ఆలోచించి ప్రచార పిచ్చికి స్వస్తి చెప్పేద్దాం. మరోప్రాణం పోకుండా కాపాడుకుందాం.

  • ఒకసామాన్యుడి ఆవేదన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News