Home Latest News Shubman Gill | శుభ్‌మన్ గిల్ వీర విహారం.. 10 రోజుల్లోనే విరాట్ కోహ్లీ రికార్డు...

Shubman Gill | శుభ్‌మన్ గిల్ వీర విహారం.. 10 రోజుల్లోనే విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

Image Source: Indian Cricket Team Facebook

Shubman Gill | టైమ్‌ 2 న్యూస్‌, ఇండోర్‌: వరుస శతకాలతో విజృంభిస్తున్న టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఈ పంజాబ్‌కా పుత్తర్‌ చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్‌తో తాజా సిరీస్‌లో వరుసగా 208, 40 నాటౌట్‌, 112 పరుగులతో సత్తాచాటిన శుభ్‌మన్‌ గిల్‌.. మొత్తంగా 360 పరుగులు పిండుకున్నాడు.

ఒకే సిరీస్‌ (3 వన్డేల)లో ఇదే అత్యధికం కాగా.. పాకిస్థాన్ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ కూడా సరిగ్గా 360 పరుగులతోనే సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక భారత్‌ తరఫున విరాట్‌ కోహ్లీ ఇటీవల శ్రీలంకతో సిరీస్‌లో 283 పరుగులు చేసి రికార్డు నెలకొల్పగా.. పది రోజులు తిరక్కుండానే గిల్‌ దాన్ని బద్దలు కొట్టి చరిత్రపుటల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఏడాది కాలంగా నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్న గిల్‌.. గత పది ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 49, 50, 45, 13, 70, 21, 116, 208, 40*, 112 పరుగులు చేసి అదరగొట్టాడు.

మొన్న మొన్నటి వరకు వన్డేల్లో రెగ్యులర్‌ ఓపెనర్‌గా కొనసాగిన శిఖర్‌ ధవన్‌ స్థానాన్ని భర్తీ చేసిన శుభ్‌మన్‌ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నాడు. 2018 అండర్‌-19 ప్రపంచకప్‌లో యువభారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు.. ఆ టోర్నీలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచిన గిల్‌.. అనంతరం ఐపీఎల్లో అదే జోరు కొనసాగించాడు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌), గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన శుభ్‌మన్‌ ఏడాది కాలంగా వన్డేల్లో చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే టెస్టు జట్టులో రెగ్యులర్‌ ఓపెనర్‌గా ఎదిగిన గిల్‌.. ఈ ఏడాది ఆఖర్లో స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు పదిలం చేసుకునే పనిలో వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 20 వన్డేలాడిన గిల్‌.. 71.37 సగటుతో 1142 పరుగులు చేశాడు. వన్డేల్లో వేగంగా వెయ్యి పరుగులు చేసిన వారిలో ఇదే అత్యుత్తమ సగటు కాగా.. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు తన పేరిట రాసుకున్నాడు.

పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌ వంటి వాళ్లతో తీవ్రమైన పోటీ ఉన్న ఓపెనర్‌ స్థానం తనదే అని తాజా సిరీస్‌లో ఒకటికి రెండుసార్లు గిల్‌ నిరూపించాడు. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో దంచికొట్టి డబుల్‌ సెంచరీ ఖాతాలో వేసుకున్న గిల్‌.. ఇండోర్‌ మ్యాచ్‌లో 112 పరుగులతో రాణించాడు. గిల్‌తో పాటు రోహిత్‌ శర్మ కూడా శతక్కొట్టడంతో న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ సత్తాచాటి ఉంటే మరింత భారీ స్కోరు చేసుండేది. అంతర్జాతీయ వన్డేల్లో భారత్‌కు ఇది 12వ అత్యధిక స్కోరు కావడం విశేషం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Uppal Match | ఉప్పల్‌లో శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ.. ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్‌పై భారత్‌ ఘన విజయం

Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

India Vs New Zealand | న్యూజిలాండ్‌పై మూడో వన్డేలోనూ భారత్‌ విజయం.. వన్డే సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

Naatu Naatu Song in Oscar list | ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ పాట.. ఎన్టీఆర్‌కు మాత్రం నిరాశే

Sarfaraz Khan | అర్జున్‌ టెండూల్కర్‌ కంటే అదృష్టవంతుడిని నాన్నా.. తండ్రితో సర్ఫరాజ్‌ఖాన్‌ భావోద్వేగం

Rohit Sharma Interview | ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు డబుల్ సెంచరీ వీరులు.. వైరల్‌ అవుతున్న రోహిత్‌ శర్మ ఇంటర్వ్యూ వీడియో

Exit mobile version