Home Latest News Indian Cricket Team | ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. భారత్ చేతిలో న్యూజిలాండ్‌కు ఇది...

Indian Cricket Team | ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. భారత్ చేతిలో న్యూజిలాండ్‌కు ఇది మూడో క్లీన్‌స్వీప్

Image Source: Indian Cricket Team Facebook

Indian Cricket Team | టైమ్‌ 2 న్యూస్‌, ఇండోర్‌: స్వదేశంలో తిరుగులేని ఫామ్‌ కొనసాగిస్తున్న భారత క్రికెట్‌ జట్టు.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం ఇండోర్‌ వేదికగా జరిగిన పోరులో 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన రోహిత్‌ సేన.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడంతో పాటు.. టాప్‌ ర్యాంక్‌ (అధికారికంగా ప్రకటించాల్సి ఉంది)కు చేరింది.

ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరిన భారత్‌.. న్యూజిలాండ్‌పై సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేసింది. ఉప్పల్‌లో జరిగిన తొలి వన్డేలో విజయానికి దగ్గర వరకు వచ్చి ఆగి పోయిన న్యూజిలాండ్‌.. రాయ్‌పూర్‌ మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఇక నామమాత్రమైన మూడో వన్డేలో భారత్‌ కొండంత స్కోరు చేయగా.. కాస్త పోరాడిన కివీస్‌ లక్ష్యానికి 90 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

ఓపెనింగ్‌ అదుర్స్‌

బ్యాటింగ్‌కు సహకరించే ఇండోర్‌ పిచ్‌పై టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. చాన్నాళ్లుగా భారీ ఇన్నింగ్స్‌ ఆడని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు)తో పాటు యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలు నమోదు చేయగా.. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (36; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) పర్వాలేదనిపించాడు. గిల్‌కు గత నాలుగు వన్డేల్లో ఇది మూడో సెంచరీ కాగా.. రోహిత్‌ శర్మ దాదాపు మూడేండ్ల తర్వాత మూడంకెల స్కోరు చేరుకున్నాడు.

సారథ్య బాధ్యతలు అందుకున్న తర్వాత అతడి బ్యాట్‌లో వేడి తగ్గిందని విమర్శించిన వారికి ఇండోర్‌లో మెరుపు ఆటతో బదులిచ్చాడు. టాపార్డర్‌ జోరు చూస్తే.. భారత వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోరు రికార్డు బద్దలు కావడం ఖాయమే అనిపించినా.. మిడిలార్డర్‌ తడబడటంతో టీమ్‌ఇండియా కాస్త తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అవసరమైన సమయంలో చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌ (25) విలువైన పరుగులు చేశాడు.

ఫన్నీ రనౌట్‌..

ఓపెనర్ల జోరుతో 26 ఓవర్లు ముగిసేసరికి 212/0తో పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా ఆ తర్వాత అదే జోరు కనబర్చలేకపోయింది. సెంచరీల తర్వాత రోహిత్‌, గిల్‌ వెనుదిరగగా.. కోహ్లీతో సమన్వ లోపం కారణంగా ఇషాన్‌ రనౌటయ్యాడు. లాంగాఫ్‌ వైపు బంతిని కొట్టి ముందు పరుగందుకున్న ఇషాన్‌.. కాస్త ముందుకు వచ్చాక మళ్లి వెనక్కి తగ్గాడు. అప్పటికే సగం పిచ్‌ దాటిపోయిన విరాట్‌.. స్ట్రయికింగ్‌ ఎండ్‌కు చేరడంతో ఇషాన్‌ నిరాశగా వెనుదిరిగాడు.

కాన్వే సెంచరీ

భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్‌ పాండ్యా వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే ఫిన్‌ అలెన్‌ (0) ఔటయ్యాడు. ఆఫ్‌ స్టంప్‌పై పడ్డ బంతిని వికెట్ల మీదకు ఆడుకొని వెనుదిరిగాడు. అయితే ఈ దశలో కాన్వే (100 బంతుల్లో 138; 12 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రీ నికోల్స్‌ (42) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దీంతో ఒక దశలో కివీస్‌ 184/2తో పటిష్టంగానే కనిపించింది. మిడిలార్డర్‌ బలంగా ఉండటంతో న్యూజిలాండ్‌కు గెలుపు అవకాశాలు ఉన్నట్లే కనిపించినా.. మన బౌలర్లు జోరు పెంచడంతో పర్యాటక జట్టుకు పరాజయం తప్పలేదు.

భారత్‌ చేతిలో న్యూజిలాండ్‌కు ఇది మూడో వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ కావడం గమనార్హం. భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Uppal Match | ఉప్పల్‌లో శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ.. ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్‌పై భారత్‌ ఘన విజయం

Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

India Vs New Zealand | న్యూజిలాండ్‌పై మూడో వన్డేలోనూ భారత్‌ విజయం.. వన్డే సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

Naatu Naatu Song in Oscar list | ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ పాట.. ఎన్టీఆర్‌కు మాత్రం నిరాశే

Sarfaraz Khan | అర్జున్‌ టెండూల్కర్‌ కంటే అదృష్టవంతుడిని నాన్నా.. తండ్రితో సర్ఫరాజ్‌ఖాన్‌ భావోద్వేగం

Rohit Sharma Interview | ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు డబుల్ సెంచరీ వీరులు.. వైరల్‌ అవుతున్న రోహిత్‌ శర్మ ఇంటర్వ్యూ వీడియో

Exit mobile version