Home Latest News Sthephen Raveendra | ఇంటికి తాళం వేసి వెళ్తున్నారా? మాకు సమాచారం ఇవ్వండి.. సెక్యూరిటీ పెంచుతాం.....

Sthephen Raveendra | ఇంటికి తాళం వేసి వెళ్తున్నారా? మాకు సమాచారం ఇవ్వండి.. సెక్యూరిటీ పెంచుతాం.. హైదరాబాద్‌ వాసులకు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర జాగ్రత్తలు

Sthephen Raveendra | సమ్మర్‌ హాలీడేస్‌ కదా సొంతూళ్లకి వెళ్దామని అనుకుంటున్నారా? పిల్లలతో కలిసి ఏదైనా హాలీ డే ట్రిప్‌ ఎంజాయ్‌ చేసి వద్దామని ప్లాన్‌ చేసుకుంటున్నారా? టూర్‌కి వెళ్లే ముందు జాగ్రత్త ! మీరు విహారయాత్రలకు వెళ్లొచ్చేసరికి మీ ఇల్లు గుల్ల అయ్యే ఛాన్స్‌ ఉంటుంది.. సమ్మర్‌లో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి హైదరాబాద్‌ వాసులు జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సూచించారు. ప్రతి ఏటా వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయని ఆయన చెప్పారు. అయితే గత కొంతకాలంగా తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా సమ్మర్‌లో జరిగే చోరీలు చాలావరకు తగ్గాయని తెలిపారు. అయినప్పటికీ కాస్త జాగ్రత్తగా ఉండాలని స్టీఫెన్‌ రవీంద్ర సూచించారు. ఇంటికి తాళాలు వేసి ఊరెళ్లే ముందు విలువైన ఆభరణాలు, నగదును బ్యాంక్‌ లాకర్లలో భద్రపరచుకోవాలని సలహా ఇచ్చారు. అలాగే ఊరెళ్లే ముందు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇస్తే.. మీరు వచ్చేదాకా ఆ ఏరియాలో గస్తీ పెంచుతామని తెలిపారు.

వేసవిలో ఈ 45 రోజులు చాలా కీలకమని.. ఈ టైమ్‌లో ఆటోమొబైల్‌, హౌస్‌ హౌల్డ్స్‌, ప్రాపర్టీ వంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంతర్రాష్ట్ర ముఠాలపై నిఘా పెంచామని తెలిపారు. అలాగే జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. వీటితో పాటు సమ్మర్‌లో ఊరెళ్లే వాళ్ల కోసం పలు సూచనలు చేశారు.

  • ఇంటికి సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ పెట్టుకోవాలి. తాళం వేసి ఊరెళ్లిది ఉంటే సెక్యూరిటీ అలారం, మోషన్‌ సెన్సర్స్‌ పెట్టుకోవాలి.
  • ఇంటికి తాళం వేయడంతో పాటు లాక్‌ చేసినట్టు కనబడకుండా ఉండేందుకు డోర్‌కు బయట నుంచి కర్టెన్‌ వేసుకోవాలి.
  • ఊరెళ్లే ముందు ఇంట్లో, బయట లైట్లు వేసి ఉంచాలి.
  • బీరువా, కప్‌బోర్డులకు సంబంధించిన తాళాలను చెప్పుల స్టాండ్‌, పరుపులు, దిండ్లు ఉంటి పసిగట్టే ప్రదేశాల్లో పెట్టకూడదు. వేరే రహస్య ప్రదేశాల్లో ఉంచాలి.
  • నమ్మకమైన వారినే పనిలో పెట్టుకోండి. కొత్తవాళ్లను పనిలో చేర్చుకునే ముందు వారికి ఏమైనా నేర చరిత్ర ఉందో తెలుసుకోండి. ముఖ్యంగా నేపాలీ వాళ్లను పనిలో పెట్టుకోవద్దు.
  • ద్విచక్రవాహనాలకు తప్పనిసరిగా హ్యాండిల్‌ లాక్‌ వేసుకోవాలి. ఇంకా అవసరమైతే చైన్‌తో తాళాలు వేయడం బెటర్‌.
  • ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను పెట్టుకోవాలి. వాటికి 24 గంటలు ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఊరెళ్లినప్పుడు ఇంటి ముందు పేపర్‌, పాల ప్యాకెట్లు జమ కాకుండా చూసుకోవాలి. అలా రెండు మూడు రోజుల నుంచి పాల ప్యాకెట్లు తీయకుండా ఉంటే చాలా రోజులుగా ఇంట్లో ఎవరూ ఉండట్లేదని దొంగలు పసిగడతారు. కాబట్టి పేపర్‌, పాల ప్యాకెట్లు వేయకుండా ముందే సమాచారం అందించాలి.
  • ముఖ్యంగా ఎటైనా వెళ్లినప్పుడు ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం మంచిది కాదు. అలా చేస్తే మీరే దొంగలకు సమాచారం ఇచ్చినట్టు అవుతుంది.
Exit mobile version