Home Latest News IPL 2023 | తొలి పోరుకు హైదరాబాద్‌ సారథిగా భువనేశ్వర్‌ కుమార్‌

IPL 2023 | తొలి పోరుకు హైదరాబాద్‌ సారథిగా భువనేశ్వర్‌ కుమార్‌

IPL 2023 | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 16వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ( Sunrisers Hyderabad ) జట్టు.. సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సారథ్యంలో బరిలోకి దిగనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ మొదటి పోరుకు అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. తాజా సీజన్‌లో హైదరాబాద్‌ తొలి పోరులో ఆదివారం ఉప్పల్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.

ప్రస్తుతం మార్క్‌రమ్‌ దక్షిణాఫ్రికా తరఫున నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌ ఆడుతుండగా.. అది ముగియగానే నేరుగా జట్టుతో కలువనున్నాడు. వచ్చే నెల 7న లక్నోసూపర్‌ జెయింట్స్‌తో ఆడనున్న రెండో పోరు వరకు మార్క్‌రమ్‌ టీమ్‌తో చేరనున్నట్లు సమాచారం. 2013 నుంచి సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భువనేశ్వర్‌ కుమార్‌.. గతంలోనూ పలు సందర్భాల్లో జట్టుకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే జట్టు ఎంపిక విషయంలోనే రైజర్స్‌ యాజమాన్యం అభిమానులను ఆశ్యర్చపరిచింది. డేవిడ్‌ భాయ్‌ అని పిలుచుకునే ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్‌ను గతేడాదే వదిలేసుకున్న హైదరాబాద్‌, ఈ సారి కేన్‌ మామను కూడా వేలానికి వదిలేసి తిరిగి కోనుగోలు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో స్టార్‌ వ్యాల్యూ పెద్దగా కనిపించడం లేదు.

బ్రూక్‌పై భారీ ఆశలు!

దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో తన జట్టుకు టైటిల్‌ సాధించిపెట్టిన కొత్త కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌.. ఐపీఎల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. గత రెండు సీజన్లుగా ఐపీఎల్లో హైదరాబాద్‌ ప్రదర్శన ఘోరంగా ఉంది. 2021లో పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన రైజర్స్‌.. గతేడాది పది జట్లలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. 2016లో టైటిల్‌ నెగ్గిన అనంతరం హైదరాబాద్‌ ఆ స్థాయి ఆటతీరు కనబర్చలేకపోతున్నది. తాజా వేలంలో ఆటగాళ్ల కొనుగోలు అంశంలోనూ సన్‌రైజర్స్‌ ఆశ్చర్యపరిచింది. నిరుడు పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి పేలవ ఆటతీరుతో జట్టులో చోటు కోల్పోయిన మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేసుకుంది. టామ్‌ మూడీ స్థానంలో హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎలాంటి ప్రయోగాలు చేస్తాడనేది ఆసక్తికరం.

ఇంగ్లండ్‌ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌ను దక్కించుకోవడం ఒక్కటే హైదరాబాద్‌కు కాస్త ప్రయోజనం చేకూర్చుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో దుమ్మురేపుతున్న ఈ ఇంగ్లండ్‌ బ్యాటర్‌ మిడిలార్డర్‌లో స్థిరత్వం తీసుకురాగలడని మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది. మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, మార్క్‌రమ్‌, బ్రూక్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మార్క్‌ జాన్సెన్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వైవిధ్యం ఉన్నా.. వీరంతా సమిష్టిగా రాణించగలరా చూడాలి! ఇక ఎప్పట్లానే రైజర్స్‌ బౌలింగ్‌ శత్రుదుర్భేద్యంగా కనిపిస్తున్నది. సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌ యూనిట్‌కు నాయకత్వం వహిస్తుండగా.. జమ్ము ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌, యార్కర్‌ కింగ్‌ నటరాజన్‌, జాన్సెన్‌, కార్తీక్‌ త్యాగి రూపంలో నాణ్యమైన పేసర్లు అందుబాటులో ఉన్నారు.

Exit mobile version