Home News AP AP MLC Elections | టీడీపీకి క్రాస్‌ ఓటింగ్‌ వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ నలుగురేనా.....

AP MLC Elections | టీడీపీకి క్రాస్‌ ఓటింగ్‌ వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ నలుగురేనా.. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు ?

AP MLC Elections | ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాకిచ్చారు. కచ్చితంగా ఏడు స్థానాల్లో గెలుస్తామనుకున్న వైసీపీ ఆరు స్థానాలకే పరిమితమవడం.. సొంత పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్‌ ఓటింగ్‌ వేయడం ఇప్పుడా పార్టీకి మింగుడుపడటం లేదు. టీడీపీకి క్రాస్‌ ఓటింగ్‌ వేసిన ఎమ్మెల్యేలు ఎవరా అని వైసీపీలో చర్చించుకుంటున్నారు. ఏపీలో ఇప్పుడిదే హాట్‌ టాపిగ్‌గా మారింది.

అయితే ముందునుంచి వైసీపీపై నలుగురు ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపిస్తూ వస్తున్నారు. గత కొద్ది కాలంగా కోటంరెడ్డి శ్రీదర్‌ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. వీరిద్దరు ప్రాతినిథ్యం వహిస్తున్ నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జిలను కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీదర్‌ రెడ్డి టీడీపీకి దగ్గరయ్యారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి కూడా వైసీపీ అధిష్ఠానం మీద ఆగ్రహంగానే ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. దీంతో ఇప్పుడు ఈ నలుగురే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌ ఇచ్చారని అందరూ అనుకుంటున్నారు.

నన్ను ఈ వివాదంలోకి లాగొద్దు: ఉండవల్లి

కాగా, ఉండవల్లి శ్రీదేవి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఒకవేళ పార్టీకి ద్రోహం చేసే ఉద్దేశమే ఉంటే తన నియోజకవర్గంలో కొత్త ఇంచార్జిని పెట్టినప్పుడే రాజీనామా చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు. ఇవాళ ఉదయమే తన కూతురుతో కలిసి సీఎం జగన్‌ను కలిసి వచ్చానని, సొంత అన్నలా చూసుకుంటానని జగన్‌ మాటిచ్చారంటూ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో క్రాస్‌ ఓటింగ్‌ చేయాల్సిన అవసరం తనకు లేదని శ్రీదేవి చెప్పుకొచ్చారు. విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నానని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దళిత మహిళను కాబట్టే చులకనగా చూస్తున్నారని వాపోయారు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేను కాబట్టే అనుమానిస్తున్నారని అన్నారు. దళిత మహిళపై దుష్ఫ్రచారం చేయడం తగదన్నారు. సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ వివాదంలోకి తనను లాగొద్దని అన్నారు.

సజ్జల సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌ జరగడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు క్యాంపు రాజకీయాలు అందరికీ తెలుసని, ప్రలోభాలకు గురి చేసి వైసీపీకి రావాల్సిన సీటును అక్రమంగా దక్కించుకున్నారని అన్నారు. ఇలాంటి వాటిలో చంద్రబాబు దేశంలోనే నంబర్‌ వన్‌ అంటూ విమర్శించారు. తమకు సంఖ్యా బలం ఉంది కాబట్టే ఏడుగురు అభ్యర్థులను బరిలో దించామని అన్నారు. ఆనం రాంనారాయణరెడ్డితో పాటు కోటంరెడ్డి శ్రీదర్‌ రెడ్డిని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.

టీడీపీకి సంఖ్యాబలం లేకున్నా బరిలో దిగి ప్రలోభాలకు పాల్పడిందని సజ్జల మండిపడ్డారు. డబ్బును ఎర చూపి ఇద్దరు ఎమ్మెల్యేలను తనవైపు చంద్రబాబు లాక్కున్నారని అన్నారు. వారెవరో తమకు తెలుసని, అవసరమైనప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీలో అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో విప్‌ జారీ చేసే అవకాశం లేదని అందుకే క్రాస్‌ ఓటింగ్‌ జరిగి ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, ఇప్పుడు అదే అడ్డదారిలో కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకున్నా ఒకసీటును గెలుపొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చరిత్ర మొత్తం ఇదేనని మండిపడ్డారు. వైసీపీకి ప్రజాబలం ఉందని, జగన్‌కు అలా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటివరకు తాము అలా ప్రలోభాలకు గురిచేయలేదని స్పష్టం చేశారు.

టీడీపీ నాయకుల రియాక్షన్‌ ఇదే..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపట్ల పార్టీ జోష్‌లో ఉంది. చంద్రబాబు ఇంటివద్ద పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. పటాకులు కాలుస్తూ స్వీట్లు తినిపించుకుంటూ హడావిడి చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా అనురాధను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. సీఎం జగన్‌పై పంచులు వేశారు. మేం 23 సీట్లే గెలిచామని ఎద్దేవా చేశారు. అందులో నలుగురిని సంతల్లో పశువుల్లా కొన్నారు. చివరికి 23వ తేదీన అదే 23 ఓట్లతో మీ ఓటమి.. మా విజయం. ఇది కదా దేవుడి స్క్రిప్టు అంటూ ట్వీట్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కే వైసీపీ పరిమితమవుతుందని గోరంట్ల బుచ్చయ చౌదరి విమర్శించారు. వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, వారిలో నలుగురు తమకు ఓటు వేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అనురాద గెలుపు ప్రజా విజయమని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళదామంటూ పిలుపునిచ్చారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

AP MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి విజయం

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

Exit mobile version