Home Lifestyle Do you know Bhogi special | సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి?...

Bhogi special | సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? వైద్యులు ఏమంటున్నారు?

Bhogi special | సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా మకర సంక్రాంతిని జరుపుకుంటాం. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ వేడుకలు భోగి మంటలతో మొదలవుతాయి. భోగి రోజు తెల్లవారుజామునే లేచి పాత వస్తువులను ఒక దగ్గర పేర్చి భోగి మంటలు వేస్తుంటారు. దీన్ని తెలుగు ప్రజలు ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటుంటారు. మరి ఇలా భోగి మంటలు ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న కారణమేంటి? అని ఎప్పుడైనా ఆలోచించారా?
దక్షిణాయానంలో ఉన్న సూర్యుడు మెల్లమెల్లగా ఉత్తరాయానంలోకి ప్రవేశిస్తున్న సమయంలో భూమి వాతావరణం మారిపోతుంటుంది. చలి పెరుగుతుంది. ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు చలి మంటలు వేసుకునేవాళ్లు. ఇవే కాలక్రమేణా భోగి మంటలుగా మారాయి. రాబోయే ఉత్తరాయాణంలో కష్టాలను దూరం చేసి సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుతూ ఈ భోగి మంటలను వేస్తుంటారు.

పురాణాలు ఏం చెబుతున్నాయి?

భుగ్‌ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం రంగనాథుడిని అమితంగా ఆరాధించిన గోదాదేవి.. చివరకు స్వామి వారిలోనే లీనమై భోగాన్ని పొందింది. దీనికి ప్రతీకగానే భోగి పండుగ జరుపుకుంటారని పురాణాల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఇంద్రుడి గర్వాణ్ని అణిచివేసేందుకు బాలకృష్ణుడు గోవర్దనగిరిని ఎత్తిన పవిత్రమైన రోజునే భోగి పండుగ జరుపుతారని పురాణాల్లో చెప్పబడింది. రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమి పైకి పంపించింది కూడా ఈ రోజునే అని చెబుతుంటారు.

బలిచక్రవర్తిని ఆహ్వానించేందుకే భోగి మంటలు

బలి చక్రవర్తిని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు వామన అవతారం ఎత్తాడు. మూడు అడుగుల జాగ ఇవ్వమని వెళ్లి బలి చక్రవర్తిపై వామనుడు కాలు పెట్టి పాతాళానికి తొక్కేశాడు. ఇక్కడి వరకు ఈ కథ అందరికీ తెలుసు. అయితే శ్రీమహావిష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన తర్వాత ఒక వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. దీని ప్రకారం బలి చక్రవర్తిని పాతాళ రాజుగా ఉండమని.. ప్రతి సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ఇక్కడ ప్రజలు ఆశీర్వదించమని వరమిచ్చాడు. అందుకే బలి చక్రవర్తిని ఆహ్వానించేందుకు భోగి మంటలు వేస్తారని కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

ఆరోగ్యానికి మంచిదే

పురాణాల్లో చెప్పినది ఏదైనా సరే భోగి మంటలు వేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో చలి విపరీతంగా పెరుగుతుంది. ధనుర్మాసంలో రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శ్వాస కోశ వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ. అదే భోగి మంటల్లో పిడకలను కాల్చడం వల్ల గాలిలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. మామిడి వంటి ఔషధ చెట్ల కట్టెలను భోగి మంటల్లో ఎక్కువగా కాలుస్తుంటారు. ఇవి మండటానికి నెయ్యిని పోస్తుంటారు. వీటివల్ల గాలి శుద్ధి అవుతుంది. ఎక్కువ శాతం ప్రాణవాయువు గాలిలోకి విడుదల అవుతుంది. కానీ ఈ రోజుల్లో టైర్లు, ప్లాస్టిక్‌, వైర్లు ఇతరత్రా వస్తువులతో భోగి మంటలు వేస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచివి కాదు. దీనివల్ల లేని పోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి భోగిమంటల్లో వీటిని కాల్చకపోవడం ఉత్తమం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kanti Velugu | తెలంగాణలో కంటి వెలుగుకు ఆధార్ తప్పని సరి.. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

TSRTC MD Sajjanar | సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నారా? కార్లెందుకు.. బస్సులో వెళ్లండి: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Ganga vilas | ప్రధాని మోదీ ప్రారంభించిన గంగా విలాస్ ఎక్కాలంటే 20 లక్షలు ఉండాల్సిందే.. ఈ క్రూయిజ్ స్పెషాలిటీ ఏంటి?

Roja Selvamani | ఆ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం జేబులో చేతులు పెట్టుకుని వెళ్లిపోయారు.. పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్లు

Exit mobile version