Home Lifestyle Devotional Navagraha Pooja | నవగ్రహాల దోషాలు పీడిస్తున్నాయా? ఇలా బయటపడండి

Navagraha Pooja | నవగ్రహాల దోషాలు పీడిస్తున్నాయా? ఇలా బయటపడండి

Navagraha Pooja | నవగ్రహ దోషాలు ఉంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అందుకే జాతకంలో నవగ్రహదోషాలు ఉంటే.. వాటికి పరిహారం చేయించుకోవడం చాలా అవసరం. మరి ఏ గ్రహదోషం ఉంటే ఏ పరిహారం చేయాలనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

నవగ్రహాల్లో మొదటిది రవి ( సూర్యుడు ). జాతకంలో రవి బలహీనంగా ఉంటే అనారోగ్యం, అధికారుల నుంచి వేధింపులు, అనారోగ్య సమస్యలు, ఆత్మ విశ్వాసం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇటువంటి వారు భానుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. గోధుమ పిండి, గోధుమ రొట్టె, కాషాయ వస్త్రాలు, రాగి, రాగి జావ, మిరియాలు దానం చేయాలి.

జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మనస్సు నిలకడగా ఉండదు. మానసిక వ్యాధులు వెంటాడతాయి. రాత్రిళ్లు నిద్ర పట్టదు. భయం, అనుమానం, స్త్రీలతో విరోధం ఉంటాయి. స్త్రీలకు గర్భాశయ సమస్యలు ఎదురవుతాయి. చంద్రుడి అనుగ్రహం కోసం బియ్యం, పాలు, మజ్జిగ దానం చేయాలి. శివునికి ఆవుపాలతో అభిషేకం జరిపించాలి. పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయాలి.

వివాహానికి, సంతానానికి ప్రధానమైన గ్రహం కుజుడు. కుజ దోషం ఉంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రమాదాల బారిన పడుతుంటారు. అన్నదమ్ములతో విబేధాలు తలెత్తుతుంటాయి. కుజ దోషం నుంచి బయటపడేందుకు కంది పప్పు, మిరపకాయలు, పచ్చి ఖర్జూర, బెల్లం, ఎరుపు వస్త్రాలు, వ్యవసాయ పనిముట్లు దానం చేయాలి.సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయ స్వామిని పూజించాలి.

జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే నరాల బలహీనత, జ్ఞాపకశక్తి లేకపోవడం, వ్యాపారాల్లో నష్టాలు ఎదురవుతాయి. బుధుడి అనుగ్రహం పొందేందుకు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. వేంకటేశ్వరస్వామి, విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి. ఆయా క్షేత్రాలను దర్శించుకోవాలి. వీటితోపాటు పెసరపప్పు, ఆకుకూరలు, కూరగాయలు, ఆకుపచ్చ వస్త్రాలు, విద్యార్థులకు విద్యా సంబంధమైన వస్తువులు దానం చేయాలి. ఆవుకు పచ్చగడ్డి వేయాలి.

గ్రహాలు అన్నింటిలో పెద్దది గురు గ్రహం. జాతకంలో గురు గ్రహ దోషం ఉంటే సుఖ సంతోషాలు కరవవుతాయి. ఎన్ని పూజలు, వ్రతాలు చేసిన ఫలితాలు ఉండవు, గురు గ్రహ దోష నివారణకు గురుచరిత్ర పారాయణం చేయాలి. గురువులను గౌరవంచాలి. దైవ క్షేత్రాలను దర్శించుకోవాలి. శనగలు, గుగ్గిళ్లు, తియ్యటి పానీయాలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేయాలి.

జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే స్త్రీలు అనారోగ్యానికి గురవుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. పెళ్లి కూడా ఆలస్యమవుతుంది. శుక్ర అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని పూజించాలి. పర్సులో వెండి నాణెం ఉంచుకోవాలి. స్త్రీలకు సంబంధించిన వస్తువులు దానం చేయాలి.

శని గ్రహ దోష నివారణకు ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. నీలం ఆకుపచ్చ దుస్తులకు దూరంగా ఉండటం వల్ల కూడా దోష పరిహారం జరుగుతుంది. నుదుటిపై పసుపు పెట్టడం వల్ల గురు బలం పెరుగుతుంది. నువ్వులు, వంట నూనె, నీలి రంగు దుస్తులు దానం చేయాలి.

రాహుగ్రహ దోష నివారణకు కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. మినప సున్నుండలు, ఇడ్లీలు, మినప గారెలు, పొగ రంగు వస్త్రాలు దానం చేయాలి. నానబెట్టిన మినుములు ఆవుకు పెట్టాలి.

జాతకంలో కేతువు బలహీనంగా ఉన్నప్పుడు మానసిక బలహీనతలు, అతి భక్తి, జీవితం మీద విరక్తి, ఒంటరిగా ఉండాలనే భావనలు పెరుగుతాయి. కేతు గ్రహ దోషం నుంచి బయటపడేందుకు పశుపక్ష్యాదులకు ఆహారం పెట్టాలి. తెలుపు రంగు కంబళి దానం చేయాలి. ఆలయాలకు విరాళాలు ఇవ్వాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Exit mobile version