Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentVeerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

Veerasimha reddy Review | అఖండ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం వీరసింహారెడ్డి. క్రాక్ వంటి సూపర్ హిట్‌ అందించిన గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు. కన్నడ స్టార్ హీరో ధునియా విజయ్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. పైగా సంక్రాంతి పండుగకు రావడంతో ఈ సినిమాపై మొదట్నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుందా? గోపిచంద్ మలినేని మరో హిట్ అందుకున్నాడా? బాలయ్య మాస్ యాక్షన్ ఎలా ఉంది? ఒకసారి చూద్దాం..

కథ

జై ( బాలకృష్ణ ) తన తల్లి మీనాక్షి ( హనీరోజ్ )తో ఇస్తాంబుల్‌లో జీవిస్తుంటాడు. ఈషా ( శ్రుతి హాసన్) ను ప్రేమించి పెళ్లికి రెడీ అవుతాడు. అప్పుడే తన తండ్రి వీరసింహారెడ్డి బతికే ఉన్నాడని జైకి తెలుస్తుంది. రాయలసీమలోని పులిచర్ల జనాలు అతన్ని దేవుడిలా భావిస్తారని జైకి అతని తల్లి చెబుతుంది. పెళ్లి సంబంధం మాట్లాడటానికి వీరసింహారెడ్డిని మీనాక్షి కబురు పంపుతుంది. మరోవైపు కర్నూలు జిల్లా పులిచర్లలో వీరసింహారెడ్డిని చంపాలని ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి ( ధునియా విజయ్ ) పగతో ఉంటాడు. మాటిమాటికి అతనిపై దాడులు చేస్తుంటాడు. ఈ క్రమంలో వీరసింహారెడ్డి విదేశాలకు వెళ్తున్నాడని తెలిసి.. అక్కడే అతన్ని చంపేయాలని ప్రతాప్ రెడ్డి, అతని భార్య భానుమతి ( వరలక్ష్మీ శరత్ కుమార్ ) ప్లాన్ చేస్తారు. భానుమతి ఎవరో కాదు వీరసింహారెడ్డి చెల్లెలే. మరి చెల్లె అన్నను చంపాలని ఎందుకు అనుకుంటుంది? వాళ్ల మధ్య వైరం ఎందుకు మొదలైంది? వీరసింహారెడ్డిని చంపాలని అనుకున్న ఆమె ప్రయత్నం సక్సెస్ అయ్యిందా? మీనాక్షి తన బావకు ఎందుకు దూరంగా ఇస్తాంబుల్‌లో ఉండాల్సి వచ్చింది? అన్నవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

తనకు అచ్చొచ్చిన ఫ్యాక్షనిజం కాన్సెప్ట్‌తోనే వచ్చాడు బాలకృష్ణ. కాకపోతే ఈసారి దీనికి గోపిచంద్ మలినేని మాస్ ఎలివెంట్స్‌తో పాటు సిస్టర్ సెంటిమెంట్ జోడించాడు. వీరసింహారెడ్డి స్టోరీ విషయానికొస్తే ఇస్తాంబుల్‌లో మొదలవుతుంది. జై పరిచయం, ఈషాతో పెళ్లి ప్రస్తావనతో మొదలై.. కథ రాయలసీమలోకి వెళ్తుంది. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. సీమలోని పులిచర్ల ఊరి ప్రజలు వీరసింహారెడ్డిని దేవుడిలా కొలుస్తుంటుంది. వీరసింహారెడ్డిని చంపేందుకు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి ప్రయత్నించడం.. చావుదెబ్బలు తిని తోకముడవడం, ఇంటికి వెళ్లాక భార్య భానుమతితో తిట్లు తినడం ఇదే రొటిన్‌గా ఉంటుంది. ఫస్టాప్ మొత్తం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్‌తోనే అయిపోతుంది. వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ వెళ్లిన తర్వాత ఊహించని ట్విస్టులతో ఇంటర్వెల్ పడుతుంది. ఇది సెకండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది. సెకండాఫ్‌లోకి వెళ్తే వీరసింహారెడ్డికి అతనికి చెల్లెకి మధ్య అనుబంధం, వాళ్ల మధ్య వైరానికి గల కారణం ఏంటనే వాటితో ఫ్లా్ష్‌బ్యాక్‌తో కథ నడుస్తుంది. రొటీన్‌ యాక్షన్ సీక్వెన్స్‌తో క్లైమాక్స్ ముగుస్తుంది.

సినిమాలో నందమూరి ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణ, ధునియా విజయ్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. ముఖ్యంగా పెళ్లి వేడుకలో, మైన్‌లో వచ్చే కుర్చీ ఫైట్‌కు థియేటర్స్‌లో విజిల్స్ పడతాయి. సెకండాఫ్‌లో ఎమోషన్ బ్యాక్‌డ్రాప్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని డైరెక్టర్ గోపీచంద్ మలినేని మరింత పకడ్బందీగా రాసుకోవాల్సింది. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అన్నీ చాలా సినిమాల్లో చూసినట్టుగా అనిపిస్తుంది. కథ, కథనంలో కొత్తదనం ఏమీ ఉండదు. సెంటిమెంట్ సీన్స్ రొటీన్‌గా ఉన్నప్పటికీ థమన్ తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వాటిని హైలైట్ చేశాడు. ఇక యాక్షన్ సీన్స్‌కు ఇచ్చిన బీజీఎంతో బాక్సులు బద్దలవుతాయి. జై బాలయ్య సాంగ్ సినిమా మ్యూజిక్ మరో హైలైట్. బుర్రా సాయిమాధవ్ డైలాగుల విషయంలో ప్రాస కోసం పాకులాడాడు. అయినప్పటికీ కొన్ని పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. బాలయ్య పొలిటికల్ పంచ్‌లు బాగున్నాయి. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది.

ఎవరెలా చేశారంటే..

బాలయ్య ఎప్పటిలాగే మాస్ యాక్షన్ ఇరగదీశాడు. కొడుకు పాత్రలో యంగ్‌గా కనిపించేందుకు బాగానే కష్టపడ్డాడు. కానీ వీరసింహారెడ్డి పాత్రలో తన నట విశ్వరూపం చూపించాడు. ఫైట్స్, డ్యాన్సులతో జై బాలయ్య అనిపించుకున్నాడు. శ్రుతి హాసన్ పాత్ర పరిధి చాలా తక్కువ. రెండు మూడు సీన్స్, సాంగ్స్‌కే పరిమితమైంది. బాలయ్యతో ఆమె రొమాన్స్ వర్కవుట్ అవ్వలేదు. శ్రుతి హాసన్ తండ్రిగా మురళీ శర్మ పాత్ర కూడా పెద్దగా స్కోప్ లేదు. మలయాళ బ్యూటీ హానీరోజ్‌కు మంచి రోల్ దక్కింది. ఫస్టాప్‌లో తల్లిగా ఏజెడ్‌ పాత్రలో నటించింది. కానీ సెకండాఫ్‌లో అందంగా కనించింది. సెంటిమెంట్ సీన్స్‌లో ఆకట్టుకుంది. బాలయ్య, హనీరోజ్ మధ్య సీన్స్ బాగుంటాయి. విలన్‌గా ధునియా విజయ్ ఫర్వాలేదనిపించాడు. బాలయ్య, ధునియా విజయ్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఆడియన్స్‌కు నచ్చుతాయి. ఇక అన్నపై పగ పెంచుకున్న చెల్లెలు పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ జీవించేసింది. మరోసారి తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసింది.

బలాలు

+ బాలకృష్ణ యాక్టింగ్

+ యాక్షన్ సీన్స్

+ థమన్ మ్యూజిక్

బలహీనతలు

– రొటీన్ స్టోరీ

– సాగదీసిన డ్రామా

చివరగా.. బాలయ్య సింహగర్జన.. ఫ్యాన్స్‌కు మాత్రమే

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Srinidhi shetty | కేజీఎఫ్ బ్యూటీకి టాలీవుడ్ నుండి భారీ ఆఫర్.. ఇక్కడైనా అదృష్టం కలిసి వస్తుందా?

natu natu song | గల్లీ బాయ్ పేరు.. అంతర్జాతీయ వేదిక పై.. గర్వంగా ఉందంటూ ఎమోషన్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌

Natu Natu | ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందే నాటు నాటు సాంగ్ చిత్రీకరణ.. పర్మిషన్ ఇవ్వడానికి కారణమిదే!

Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్‌లో అనుపమ ఫిక్స్.. అల్టర్‌నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News